మరో 25 సంవత్సరాలు: ఈ బడ్జెట్టే పునాది: నిర్మలమ్మ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్.. కొద్దిసేపటి కిందటే లోక్‌సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. ఈ ఉదయం సరిగ్గా 11 గంటలకు ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని ఆరంభించారు. గౌరవ పూరకంగా సభకు నమస్కరించారు. అనంతరం బడ్జెట్ ప్రతిపాదనలను చదవటం మొదలు పెట్టారు. ఈ సంవత్సరం మార్చి 31వ తేదీన ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 9.27 శాతంగా అంచనా వేసినట్లు చెప్పారు. దీన్ని అందుకుంటామనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు.
2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్.. అత్యుత్తమం, అత్యంత కీలకమైనదిగా నిర్మల సీతారామన్ అభివర్ణించారు. దీనికి గల కారణాన్ని కూడా వివరించారు. ప్రస్తుతం దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటోందని గుర్తు చేశారు. మరో 25 సంవత్సరాల తరువాత.. చారిత్రాత్మక ఘట్టాన్ని అందుకుంటుందని అన్నారు. 100వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగు పెడుతుందని చెప్పారు.

ఈ 25 సంవత్సరాల సమయాన్ని అత్యంత విలువైనదిగా భావిస్తున్నామని నిర్మల సీతారామన్ చెప్పారు. ఇదొక అమృత కాలామని వ్యాఖ్యానించారు. అలాంటి అమృత కాలానికి ఈ బడ్జెట్ పునాది వేస్తోందని అన్నారు. వచ్చే 25 సంవత్సరాల్లో సాధించబోయే అభివృద్ధికి బ్లూప్రింట్‌ను రచిస్తుందని పేర్కొన్నారు. భారత్ 100వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొనే సమయానికి ఎంతో అభివృద్ధి సాధిస్తుందనే విశ్వాసం తనకు ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్‌కు రూపకల్పన చేశామని అన్నారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు, మూల ధన వ్యయంలో పెరుగుదల కనిపించిందని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. 2022-23 బడ్జెట్‌లో యువజనులు, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు లబ్ది కలిగించేలా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా పురోగమిస్తామని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఇ-శ్రమ్, ఎన్సీఎస్, అసీమ్ పోర్టల్లను ఇంటర్‌లింక్ చేయడం ద్వారా పారిశ్రామిక అవకాశాలను పెంపొందించినట్టవుతుందని అన్నారు.


Click it and Unblock the Notifications