Union Budget: ఇవి పరిష్కారమయ్యేలా... నిర్మలమ్మకు కీలక ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్‌కు సంబంధించి ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల్లో భాగంగా సోమవారం (డిసెంబర్ 14) పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా తుడిచిపెట్టుకు పోయింది. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి కీలక సంస్కరణలు, వివిధ రంగాల్లోని నిపుణుల సూచనలు అవసరం. ప్రభుత్వం, పరిశ్రమ ఏకతాటి పైకి వచ్చి ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో తదుపరి బడ్జెట్ కోసం నిర్మల సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

భేటీలో ఉదయ్ కొటక్, కిరణ్ మజుందర్
బడ్జెట్ తయారీకి ముందు ప్రభుత్వం, ఆర్థిక మంత్రి, అధికారులు వివిధ వర్గాలతో భేటీ అయి, సలహాలు, సూచనలు తీసుకుంటారు. నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో కొటక్ మహీంద్రా బ్యాంకు అధినేత ఉదయ్ కొటక్, బయోకాన్ నుండి కిరణ్ మజుందార్ షా తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆర్థికమంత్రితో పాటు ఫైనాన్స్ సెక్రటరీ ఏబీ పాండే, సెక్రటరీ, డీఈఏ తరుణ్ బజాజ్, చీఫ్ ఎకనమిస్ట్ అడ్వైజర్ కే సుబ్రమణియన్ సహా పలువురు అధికారులు ఉన్నారు.

సీఐఐ కీలక సూచనలు, ప్రతిపాదనలు
కేంద్ర బడ్జెట్ కోసం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(CII) మూడు వ్యూహాలను ముందుకు తెచ్చింది. కరోనా మహమ్మారి ప్రభావాన్ని అధిగమించడమే లక్ష్యంగా వృద్ధి, ఆర్థిక ఏకీకరణ, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలపై దృష్టి సారించింది. బడ్జెట్ ప్రతిపాదనలు ప్రధానంగా వృద్ధి, ఆర్థిక నిర్వహణ లక్ష్యంగా ఉండాలని CII సూచించింది. మూడేళ్ళ లక్ష్యంగా ఉండాలని తెలిపింది. పన్ను ఆదాయం బాగా పడిపోయిన ఈ పరిస్థితుల్లో పెట్టుబడుల ఉపసంహరణ, అసెట్స్ మోనిటైజేషన్ వల్ల ఆదాయం ఆర్జించవచ్చునని పరిశ్రమ సంఘం తెలిపింది. CII కూడా తన సిఫార్సులను నేడు సమర్పించింది.

వీటిని పరిష్కరించేలా..
మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, సుస్థిరత అనే మూడు ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కొటక్ మహీంద్రా బ్యాంకు అధినేత ఉదయ్ కొటక్ అన్నారు. ప్రయివేటు పెట్టుబడులను ప్రోత్సహించడం, ఉపాధి కల్పనకు సహకారం అందించే రెండు క్లిష్టమైన రంగాలకు పరిష్కారం దిశగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలన్నారు.


Click it and Unblock the Notifications