Insurance News: ఉద్యోగం కోల్పోయారా? నెలవారీ EMIలు గురించి చింతిస్తున్నారా..? ఇదిగో సొల్యూషన్!
Unemployment Insurance: కరోనా అనంతరం పలు వ్యాపారాల్లో మందగమనం ఏర్పడింది. తిరిగి కోలుకునే సమయానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దానికి ఆజ్యం పోసింది. వీటి పర్యవసానంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అకస్మాత్తుగా కంపెనీలు ప్రకటించే లేఆఫ్స్ వల్ల నెలజీతానికి పనిచేసే అమాయకులు బలైపోతున్నారు. ఇల్లు గడపలేక, EMIలు కట్టలేక సతమతమవుతున్నారు. మరి దీనికి పరిష్కారం ఏమైనా ఉందా అంటే.. ఉంది.
లేఆఫ్స్ బాధితులకు సహాయం చేసేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఓ వినూత్న బీమాని అందిస్తున్నాయి. అదే నిరుద్యోగ బీమా. ఉద్యోగుల తొలగింపు సమయంలో వారి ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించినదే ఈ బీమా. అయితే ఇప్పటికీ దీని గురించి చాలా మందికి తెలియకపోవడం బాధాకరం.

ఇండియాలో ఉద్యోగ రక్షణకు నిర్దిష్టమైన బీమా అనేది లేనప్పటికీ.. రాజీవ్ గాంధీ శ్రామిక్ కళ్యాణ్ యోజన(RGSKY) కింద గతంలో ప్రభుత్వం సహకారం అందించేది. ఇప్పుడు దానిని ESIకి లింక్ చేశారు. తద్వారా RGSKYతో లభించే నిరుద్యోగ భృతిని ESI అందిస్తోంది. దీని ద్వారా లబ్ధి పొందాలంటే మాత్రం ఉద్యోగి ఖాతాలో జమయ్యే నెలవారీ వేతనం 21 వేలకు మించకుండా ఉండాలి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1885771 ద్వారా తెలుసుకోవచ్చు.
జీతం 21 వేల కంటే ఎక్కువ ఉంటే మాత్రం RGSKY వర్తించదు. ఇలాంటి వారికి హెల్త్ మరియు హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్స్‌తో కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు జాబ్ లాస్ బీమాను యాడ్-ఆన్ గా అందిస్తున్నాయి. వాటికి సంబంధించిన నియమ, నిబంధనల ఆధారంగా ఆయా ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ప్రతి బీమా మాదిరిగానే దీనికి కూడా పరిమితులు ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications