gst scam: నిరుద్యోగికి 25 లక్షల పన్ను నోటీస్.. అసలేం జరిగిందంటే..
gst scam: ఇటీవల పలు రాష్ట్రాల్లో GST రిజిస్ట్రేషన్స్ స్కామ్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా మరోసారి ఈ తరహా ఘటన ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో జరిగింది. కాగా ఓ నిరుద్యోగి ఈ స్కామ్ కు బాధితుడిగా మిగలడం గమనార్హం.
బులంద్‌షహర్ నివాసి దేవేంద్ర కుమార్ కు మార్చిలో ట్యాక్స్ నోటీసు వచ్చింది. దాని ప్రకారం 1.36 కోట్ల టర్నోవర్ ఉన్న తన కంపెనీకి సంబంధించి ప్రభుత్వానికి 24.61 లక్షలు బకాయిపడినట్లు అందులో ఉంది. వారం తర్వాత ఏప్రిల్ లో 1.16 కోట్ల టర్నోవర్ ఉన్న మరో సంస్థ విషయంలోనూ ఇదే తరహా నోటీసు అందుకున్నాడు. అయితే అతడికి కనీసం ఏ ఉద్యోగం కూడా లేక నెలల తరబడి నిరుద్యోగిగా ఉండటం విశేషం.

ఈ నోటీసులపై దేవేంద్ర కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండేళ్ల క్రితం తాను నోయిడాలో ఓ కంపెనీలో పనిచేసినట్లు చెప్పాడు. ఆ సమయంలో అక్కడి కాంట్రాక్టర్లు తన నుంచి ఆధార్, పాన్ కార్డులు తీసుకున్నారని తెలిపాడు. వాటిని దుర్వినియోగం చేసి కొత్త కంపెనీల GST రిజిస్ట్రేషన్స్ కోసం వాటిని వినియోగించి ఉండవచ్చిని గౌతమ్ బుద్ధ నగర్ పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశాడు.
"నేను చాలా పేదవాడిని. గతంలో నరౌరాలోని టౌన్‌షిప్ ప్రాజెక్ట్‌లో కూలీగా పని చేశాను. అక్కడ రోజు కూలీ దాదాపు 300. ఇప్పుడు నాకు ఆ పనీ లేదు. అలాంటి పరిస్థితుల్లో కోట్ల టర్నోవర్ ఉన్న రెండు కంపెనీలకు నేను ఎలా యజమానిని కాగలను?" అని దేవేంద్ర కుమార్ తన బాధను వ్యక్తం చేశారు. కేవలం FIRలు నమోదు చేసేందుకే ఇప్పటివరకు 40 వేలు ఖర్చు చేసినట్లు చెప్పాడు. కాగా ఈ వ్యవహారంపై విచారణ జరపనున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.


Click it and Unblock the Notifications