సముద్ర గర్భంలో భారీ బంగారం నిల్వలు.. రహస్యంగా పసిఫిక్‌లో వేట మొదలుపెట్టిన చైనా..
Underwater Gold Mine: పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర గర్భంలో ఇంతకుముందు తెలియని ఒక భారీ క్రియాశీలక అధిక-ఉష్ణోగ్రత హైడ్రోథర్మల్ క్షేత్రాన్ని (Hydrothermal Field) చైనా శాస్త్రవేత్తల సంయుక్త బృందం కనుగొంది. అంతర్జాతీయ మీడియా సంస్థ సీజీటీఎన్ (CGTN) కథనం ప్రకారం.. సింఘువా విశ్వవిద్యాలయం, చైనా జియోలాజికల్ సర్వే పరిధిలోని క్వింగ్‌డావో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ జియాలజీ, షాంఘై జియావోటాంగ్ విశ్వవిద్యాలయంతో పాటు ఇతర ప్రముఖ పరిశోధనా సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ సముద్రగర్భ అన్వేషణలో పాల్గొన్నారు.
తమ దేశీయ పరిజ్ఞానంతో స్వయంగా అభివృద్ధి చేసిన పరికరాలను ఉపయోగించి పసిఫిక్ సముద్రం కింద ఉన్న ఈ కొత్త క్షేత్రాన్ని వారు గుర్తించారు. ప్రాథమిక పరిశోధనలు, అక్కడి నుండి సేకరించిన నమూనాల విశ్లేషణ ప్రకారం.. ఈ ప్రాంతంలో భారీ పరిమాణంలో పాలిమెటాలిక్ సల్ఫైడ్ ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా భూమిపై లభించే సాధారణ ఖనిజ నిక్షేపాల కంటే ఈ నమూనాలలో Gold, వెండి సగటు సాంద్రతలు (Concentrations) చాలా ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు ధృవీకరించారు.

ఈ చారిత్రాత్మక పరిశోధన కోసం శాస్త్రవేత్తల బృందం 'జియాంగ్ యాంగ్ హాంగ్ 10' అనే అత్యాధునిక పరిశోధన నౌకలో షెన్‌జెన్ నగరం నుండి ఆగస్టు 10న బయలుదేరి 18 రోజుల పాటు సముద్రయానం నిర్వహించింది. ఈ యాత్రలో భాగంగా, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో చైనా యొక్క ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) పరిధిలో ఉన్న ఒక బ్యాక్-ఆర్క్ బేసిన్ ప్రాంతంలో బృందం మొత్తం ఏడు విడతల సర్వేలను పూర్తి చేసింది.
నిజానికి ఈ తాజా యాత్రకు ముందే పరిశోధకులు ఈ ప్రాంతంలో 10 కంటే ఎక్కువ ప్రాథమిక సర్వేలను నిర్వహించారు. ఆ సన్నాహక సర్వేల సమయంలోనే సముద్ర ఉపరితలం నుండి 700 నుండి 1,500 మీటర్ల లోతులో ఉన్న డజన్ల కొద్దీ అధిక-ఉష్ణోగ్రత హైడ్రోథర్మల్ వెంట్‌లను (రంధ్రాలను) వారు గుర్తించారు. ఈ బిలాల నుండి బయటకు వెలువడుతున్న ద్రవాల ఉష్ణోగ్రత 315 డిగ్రీల సెల్సియస్‌ను మించి నమోదవగా, అది అక్కడ తీవ్ర స్థాయిలో జరుగుతున్న హైడ్రోథర్మల్ భూగర్భ కార్యకలాపాలను స్పష్టంగా సూచిస్తోంది.
పూర్వపు ఆధారాలను బట్టి సేకరించిన సమాచారంతో పరిశోధన బృందం సముద్రపు అడుగుభాగంలో వివరణాత్మక మ్యాపింగ్ చేపట్టి ప్రయోగాత్మక నమూనాలను సేకరించింది. ఈ ప్రక్రియలోనే ఆ బేసిన్‌లో వ్యాపించి ఉన్న ఒక భారీ హైడ్రోథర్మల్ ఖనిజ నిక్షేపాన్ని వారు కనుగొన్నారు. ఈ నిక్షేపానికి సంబంధించిన సల్ఫైడ్ ధాతువు పరిధిలో మూడు పెద్ద శంకు (Cone) ఆకారపు అరుదైన నిర్మాణాలు వెలుగు చూశాయి. సముద్ర నౌకలోని ప్రయోగశాలలోనే నిర్వహించిన ప్రాథమిక సైంటిఫిక్ పరీక్షలలో, ఈ ధాతువు ప్రధానంగా చాల్కోపైరైట్, పైరైట్ మరియు స్ఫాలరైట్‌లతో కూడుకున్నట్లు తేలింది. ఆర్థికంగా ఎంతో విలువైన, కీలకమైన ఈ ఖనిజాలతో పాటు భారీగా లభ్యమవుతున్న బంగారం, వెండి ఆనవాళ్లు రాబోయే రోజుల్లో సముద్రగర్భ ఖనిజ అన్వేషణకు నూతన దారులు తెరవనున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications

