Unclaimed Bank Deposits : భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో రూ.67,003 కోట్ల విలువైన డిపాజిట్లు మగ్గిపోతున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంటులో వెల్లడించింది. ఈ మొత్తానికి హక్కుదారులు ఎవరూ లేరని స్పష్టం చేసింది. ఈ మొత్తంలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రూ.58,330 కోట్లు ఉండగా.. రూ.8,673.72 కోట్లు ప్రైవేటు బ్యాంకుల పరిధిలో ఉన్నాయి. 2025 జూన్ త్రైమాసికం నాటికి ఈ మొత్తం నమోదు కాగా, అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వద్దే ఈ డిపాజిట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. భారతీయ బ్యాంకుల్లో హక్కుదారులే లేకుండా రూ.67,003 కోట్లు అనవసర డిపాజిట్లు ఉన్నాయన్నారు. మొత్తం అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లలో SBI వాటా దాదాపు 29 శాతంగా ఉందని తెలినారు. అంటే సుమారుగా రూ.19,329.92 కోట్లు ఎస్బీఐలో హక్కుదారులు లేకుండా డిపాజిట్లు ఉన్నాయి.

ఇక పీఎన్‌బీలో రూ.6,910 కోట్లు, కెనరా బ్యాంక్‌లో రూ.6,278 కోట్లు చొప్పున ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల విషయానికి వస్తే.. అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంకుల్లో రూ.2,063 కోట్లు క్లెయిమ్ లేకుండా మగ్గిపోతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో రూ.1,609 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.5,277.36 కోట్లు, యాక్సిస్ బ్యాంకులో రూ.1,360 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.5,104.50 కోట్లు చొప్పున అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయి.
అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు అంటే ఏమిటి: పది సంవత్సరాలపాటు వినియోగించని పొదుపు లేదా కరెంట్ ఖాతాలను అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పరిగణిస్తారు. ఖాతాదారుడు లేదా వారసులు ఈ డబ్బును క్లెయిమ్ చేయకపోతే.. ఆ డబ్బు డిపాజిటరీ ఎడ్యుకేషన్ అండ్ అవగాహన ఫండ్ (DEAF)కి బదిలీ చేయబడుతుంది. ఇది RBI ఆధ్వర్యంలో నడిచే ప్రత్యేక నిధి అని చెప్పవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్గమ్ పోర్టల్ ద్వారా ఈ క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోవచ్చు. దేశంలోని దాదాపు 30 ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్థిక సంస్థల్లోని క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలు ఈ పోర్టల్ లో అందుబాటులో ఉంచారు.
2022-23 ఆర్థిక సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం సగటున రూ.4,500 కోట్లు చొప్పున ఈ నిధిలోకి వెళ్లుతున్నాయని కేంద్రం తెలిపింది. దీంతో DEAF నిధి వేగంగా పెరుగుతోంది. ప్రజలు ఖాతాలను మర్చిపోవడం, నామినీ లేని ఖాతాలు ఉండటం, మరణాల తర్వాత వారసులు క్లెయిమ్ చేయకపోవడం దీనికి కారణాలుగా ఆర్బీఐ చెబుతోంది.
UDGAM పోర్టల్ ద్వారా ఎలా క్లెయిమ్ చేయొచ్చు: RBI ప్రారంభించిన UDGAM పోర్టల్ ద్వారా అనవసర డిపాజిట్లు ఎవరి పేరిట ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఆధార్ లేదా పాన్ నంబర్ ఆధారంగా సులభంగా తనిఖీ చేయవచ్చు.
ఇందు కోసం మీరు ముందుగా ఉద్గమ్ పోర్టల్(https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login)ను సందర్శించాలి. అక్కడ కనిపించే రిజిస్టర్ బటన్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి రిజిస్టర్ అవ్వాలి.అనంతరం మీ పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ కి వచ్చే ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి.మీ వివరాలు రిజిస్టర్ చేసుకున్న తర్వాత సైట్ లోకి లాగిన్ అవ్వాలి.
తర్వాత పేజీలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులను ఎంచుకోవాలి. మీ ధ్రువీకరణ కోసం పుట్టిన తేదీ, ఓటరు ఐడీ, పాస్ పోర్ట్ నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు వంటి వివరాలు అందులో ఇవ్వాలి. ఒకవేళ మీకు సంబంధించి ఏదైనా అన్‌క్లెయిమ్ డిపాజిట్లు ఉంటే అన్‌క్లెయిమ్ డిపాజిట్ రిఫరెన్స్ నంబర్ (యూడీఆర్ఎన్) వస్తుంది. ఈ పోర్టల్ ద్వారా ప్రతి బ్యాంకుకు క్లెయిమ్ సూచనలు వెళుతాయి.మీకు వచ్చిన యూడీఆర్‌ఎన్ ద్వారా బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications