Udan Yatri Cafe: విమానాశ్రయంలో రూ. 10 లకే చాయ్.. ఆశ్చర్యపోకండి.. ఇది అక్షరాలా నిజం!
సాధారణంగా విమానాశ్రయానికి వెళ్తే ధరలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఒక బాటిల్ వాటర్ కావాలన్నా వంద రూపాయలు, చిన్న కప్పు కాఫీ తాగాలన్నా రెండు వందలు పెట్టాల్సిందే. కానీ, పుణే విమానాశ్రయంలో ఇప్పుడు పరిస్థితి మారింది. కేవలం పది, ఇరవై రూపాయలకే స్నాక్స్ లభిస్తుండటం ఇప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ (trending) గా మారింది. దీనికి కారణం రాజ్యసభ ఎంపీ రాఘవ చద్దా పార్లమెంటులో చేసిన పోరాటమేనని ప్రయాణికులు కొనియాడుతున్నారు.

రూ. 20 సమోసా.. రూ. 10 చాయ్!
ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి పీయూష్ త్రిపాఠి తన భార్యతో కలిసి పుణే విమానాశ్రయంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వీడియో తీశారు. అందులో ఆయన తన భార్యను "ఎయిర్‌పోర్ట్ లో సమోసా తింటావా?" అని అడుగుతారు. ఆమె ఆశ్చర్యంగా "సరే" అంటుంది. అప్పుడు వారు విమానాశ్రయంలోని 'ఉడాన్ యాత్రి కేఫ్' (Udan Yatri Cafe) కు వెళ్తారు. అక్కడ వారికి కేవలం రూ. 20 కే సమోసా, రూ. 10 కే చాయ్ లభిస్తాయి. "ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైంది?" అని ఆయన అడగగా ఆమె వెంటనే "రాఘవ చద్దా" అని సమాధానం ఇస్తుంది. అంతేకాదు, ఆయన ఎలా ఉంటారని అడిగితే "చాలా హ్యాండ్సమ్" అని నవ్వుతూ చెబుతుంది.
ఎంపీ రాఘవ చద్దా పోరాటం
2024 పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాఘవ చద్దా విమానాశ్రయాల్లో దోపిడీ ధరల గురించి గట్టిగా గళమెత్తారు. "ఎయిర్‌పోర్ట్ లో నీళ్ల బాటిల్ రూ. 100, టీ రూ. 250 ఉండటం ఏంటి? సామాన్యుల కోసం ప్రభుత్వం చౌక ధరల క్యాంటీన్లను ఎందుకు ఏర్పాటు చేయదు?" అని ఆయన ప్రశ్నించారు. కేవలం ధరలే కాకుండా, ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ వైఫల్యాలను, బస్టాండ్ ల కంటే అధ్వాన్నంగా ఉన్న క్యూ లైన్ల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆయన చొరవతోనే ఇప్పుడు ప్రభుత్వం 'ఉడాన్ యాత్రి కేఫ్' లను ప్రారంభించింది.
ఉడాన్ యాత్రి కేఫ్ ప్రత్యేకతలు
మధ్యతరగతి ప్రయాణికులకు ఈ కేఫ్ ఒక వరంలా మారింది. ఇక్కడ ధరలు ఎలా ఉంటాయంటే..
- • చాయ్ / వాటర్ బాటిల్: రూ. 10
- • కాఫీ: రూ. 20
- • సమోసా / కచోరీ / ప్యాటీస్: రూ. 20
- • స్వీట్ ఆఫ్ ది డే: రూ. 20
విమానాశ్రయాల్లో ఇటువంటి వెసులుబాటు రావడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. "ఎయిర్‌పోర్ట్ అంటేనే ఖరీదు అనే భ్రమను ఈ కేఫ్‌లు తొలగించాయి" అని ఒక ప్రయాణికుడు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేఫ్ సౌకర్యం పుణేతో పాటు కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, భువనేశ్వర్, విజయవాడ , ఇటానగర్ విమానాశ్రయాల్లో అందుబాటులో ఉంది. సామాన్యుల సమస్యలపై స్పందించే నాయకులు ఉండాలని నెటిజన్లు రాఘవ చద్దాను అభినందిస్తున్నారు.


Click it and Unblock the Notifications