ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్, స్పాన్సరర్లకు కోట్ల రూపాయల మేర కనకవర్షాన్ని కురిపించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్.. 15వ ఎడిషన్ ఇటీవలే ముగిసింది. గుజరాత్ టైటాన్స్ ఈ ఐపీఎల్ 2022 సీజన్ ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించిన ఫైనల్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఐపీఎల్‌లో తన ప్రస్థానాన్ని ఆరంభించిన తొలి సీజన్‌లోనే టైటిల్‌ను ఎగరేసుకెళ్లింది హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్.
అల్టిమేట్ ఖొఖొ టోర్నమెంట్..
ఈ సందడి ముగిసీ ముగియగానే- ఇప్పుడు తాజాగా ఖొఖొ లీగ్ టోర్నమెంట్ ఆరంభం కాబోతోంది. ఐపీఎల్ తరహాలోనే- అల్టిమేట్ ఖొఖొ టోర్నమెంట్ పేరుతో ప్రతి సంవత్సరం నిర్వహించే టోర్నమెంట్ ఇది. వరుసగా రెండేళ్ల పాటు పట్టాలెక్కలేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గత రెండు సీజన్లను రద్దు చేశారు. ఖొఖొ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ టోర్నమెంట్‌ను డాబర్ గ్రూప్ ఛైర్మన్ అమిత్ బర్మన్ ప్రమోట్ చేస్తోన్నారు. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా ఈ టోర్నీని బ్రాడ్‌కాస్ట్ చేస్తుంది.

జీఎంఆర్ చేతికి తెలంగాణ ఫ్రాంఛైజీ..
కాగా- ఇప్పుడు తాజా మరో రెండు ఫ్రాంఛైజీలు తెర మీదికి వచ్చాయి. ఇందులో ఒకటి తెలంగాణ నుంచి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ అల్టిమేట్ ఖొఖొ ఫ్రాంఛైజీని జీఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని జీఎంఆర్ కార్పొరేటర్ ఛైర్మన్ కిరణ్ కుమార్ గ్రంధి వెల్లడించారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం గ్రంధి మల్లికార్జున రావు సారథ్యంలోని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఇవి. ఇప్పటికే జీఎంఆర్‌కు ఐపీఎల్ ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీలో వాటాలు ఉన్నాయి. 50 శాతం ఇన్వెస్ట్‌మెంట్ దీనిదే. తెలంగాణ ఖొఖొ ఫ్రాంఛైజీ కోసం ఎంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసిందనేది వెల్లడించలేదు.

అదాని ఆధీనంలో గుజరాత్..
మరో ఫ్రాంఛైజీ- గుజరాత్‌ను అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు కొనుగోలు చేసింది. ఇదివరకు ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేయడానికి గౌతమ్ అదానీ సారథ్యంలోని ఈ గ్రూప్ ప్రయత్నాలు చేసింది గానీ- అవి ఫలించలేదు. ఐపీఎల్ గుజరాత్ ఫ్రాంఛైజీని సీవీసీ కేపిటల్స్ ఎగరేసుకెళ్లింది. అదాని కంటే అక్షరాలా 500 కోట్ల రూపాయల మొత్తాన్ని అధికంగా కోట్ చేస్తూ బిడ్డింగ్స్ వేసింది సీవీసీ కేపిటల్స్. దీనితో ఆ అవకాశం కోల్పోయిన అదాని- అల్టిమేట్ ఖొఖొ ద్వారా దక్కించుకుంది. హోమ్ స్టేట్ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసింది.
ముచ్చటగా మూడోదిగా..
అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల్ల ఒకటైన అదాని స్పోర్ట్స్‌లైన్ ఈ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసింది. దీనికోసం ఎంత మొత్తాన్ని ఖర్చు చేసిందనేది ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఇప్పటికే దీని ఆధీనంలో ఇండియన్ బాక్సింగ్ లీగ్, కబడ్డీ లీగ్ ఫ్రాంఛైజీలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఖొఖొ ఫ్రాంఛైజీ వచ్చి చేరింది. సంప్రదాయబద్ధమైన గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడంలో తాము ఎప్పుడూ ముందంజంలో ఉంటామని అదాని ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్ ప్రణవ్ అదాని చెప్పారు.


Click it and Unblock the Notifications