Adani Debts: అదానీకి మేము ఎందుకు అప్పులు ఇవ్వకూడదు..? UCO బ్యాంక్ సీఈవో కామెంట్స్..
Adani Debts: అదానీ గ్రూప్ కంపెనీల అప్పుల విషయం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. దీనిపై బ్యాంకింగ్ రంగంలో పెద్ద చర్చే జరుగుతోంది. తాము అదానీ గ్రూప్ కంపెనీలకు అప్పులిస్తామని కొందరు అంటుండగా.. ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని మరికొందరు అంటున్నారు. ఇక ఈపీఎఫ్ఓ, ఎల్ఐసీ లాంటి సంస్థలైతే తాము పెట్టుబడులను కొనసాగిస్తామని ఇప్పటికే స్పష్టమైన ప్రకటనలు చేశాయి.
ఈ క్రమంలో తాజాగా ఇదే విషయంపై యూకో బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సోమ శంకర ప్రసాద్ స్పందించారు. తాము అదానీ గ్రూప్‌తో వ్యాపారాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. అయితే అదానీ ప్రాజెక్టులు లాభదాయకమైనవని తేలితే ముందుగు వెళతామని స్పష్టం చేశారు. ఎలాంటి కారణం లేకుండా కమర్షియల్గా మంచి ఆదాయాన్ని అందించే ప్రాజెక్టులకు ఎందుకు అప్పులు ఇవ్వకూడదో చెప్పాలన్నారు.

దీనికి ముందు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా సైతం అదానీ కంపెనీలకు అప్పులిచ్చే విషయంలో ఇలాంటి వైఖరిని వెల్లడించింది. ఇదే సమయంలో అమెరికా బ్యాంకింగ్ సంక్షోభంపై ప్రసాద్ మాట్లాడారు. గ్లోబల్ బ్యాంకింగ్ సంక్షోభం ప్రభావం భారత్ పై ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే.. దేశీయ బ్యాంకులు దాదాపు 90-95 శాతం వరకు రిటైల్ డిపాజిట్లపై ఆధారపడి ఉన్నాయని ఆయన వెల్లడించారు. వీరంతా దేశవ్యాప్తంగా విస్తరించిఉన్న చిన్న డిపాజిటర్లని అందువల్ల ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల పరిస్థితిపై ఎలాంటి సందేహం అక్కర్లేదని అన్నారు.
హిండెన్ బర్గ్ అదానీ రుణాలపై, అకౌంటింగ్ పద్ధతులపై చేసిన ఆరోపణలు కంపెనీ షేర్లను పాతాళానికి నెట్టాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్ ఆఫ్ షోర్ డీల్స్ వ్యవహారంలో సెబీ దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు వచ్చిన వేళ నేడు మార్కెట్లలో అదానీ గ్రూప్ కంపెనీలు మళ్లీ డీలా పడ్డాయి. ఇన్వెస్టర్లు అమ్మకానికి ఎక్కువగా మెుగ్గు చూపటంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.


Click it and Unblock the Notifications