BJP News: ఎన్నికలలో సింగిల్ పార్టీ గెలిచి, అధికారంలోకి రావడం ఏ దేశానికైనా పాజిటివ్ గా భావిస్తారు. అదే జరిగితే స్టాక్ మార్కెట్లో లాభాల పంట పండుతుంది. ఎందుకంటే స్థిరమైన ప్రభుత్వం కొలువుదీరడం వల్ల విధానపరమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఎటువంటి ఇబ్బందీ తలెత్తదు. సంకీర్ణ ప్రభుత్వాల విషయంలో అలా కుదరదు. మిత్ర పక్షాలను తప్పకుండా ఒప్పించాల్సి ఉంటుంది. వారికి నచ్చకపోతే వెనక్కు తగ్గడం తప్ప మరో మార్గం ఉండదు.
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలలో BJP తిరిగి అధికారం చేజిక్కించుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ UBS కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వేళ BJP అధికారాన్ని కోల్పోతే ఈక్విటీ వాల్యుయేషన్‌లు NDA అధికారంలోకి రాకముందు స్థాయికి పడిపోవచ్చని హెచ్చరించింది.

'ఊహించని ఫలితం ఏర్పడితే రాజకీయ అస్థిరతతో పాటు వ్యాపార సెంటిమెంట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతింటుంది. దీన్ని ప్రతికూలంగా భావించి, సమీప కాలంలో ఆర్థిక మార్కెట్లు తీవ్ర కుదుపులకు గురవుతాయి. ఈక్విటీ వాల్యుయేషన్స్ బహుశా ప్రీ-NDA స్థాయిలను టచ్ చేసే అవకాశం ఉంది' అని UBS తెలిపింది.
సింగిల్ పార్టీ మెజారిటీని BJP నిలుపుకుంటే ప్రభుత్వ విధానాల కొనసాగింపుపై మార్కెట్లు నమ్మకంగా ఉంటాయని UBS వెల్లడించింది. పెట్టుబడుల ఉపసంహరణ వంటి మరిన్ని సంస్కరణలు, భూమి బిల్లు, యూనిఫాం సివిల్ కోడ్ అమలు వంటివి ఆ పార్టీ గెలిచిన సీట్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని అంచనా వేసింది. అయితే ఆర్థిక మార్కెట్ల సెంటిమెంట్ మాత్రం సానుకూలంగా ఉంటుందని భావిస్తోంది.
ఒకవేళ సింగిల్ మెజారిటీ విషయంలో విఫలమైనా.. NDAతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే మార్కెట్లు కొంతమేర నమ్మకంగా ఉండవచ్చని UBS పేర్కొంది. అదే హంగ్ వస్తే మాత్రం మార్కెట్లలో అనిశ్చితి ఉండవచ్చని తెలిపింది. నిర్ణయాత్మక సంస్కరణలను అమలు చేయడంలో వెనుకబాటుకు దారితీయవచ్చని వెల్లడించింది. ఇక ప్రభుత్వం మారినా మార్కెట్లు ప్రతికూలంగా భావించి తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని తేల్చింది.


Click it and Unblock the Notifications