Unemployment Insurance: ప్రజల జీవన ప్రమాణాలు వృద్ధి చెందుతున్న వేళ.. ఆర్థిక, ఆరోగ్య ఇబ్బందులూ పెరుగుతున్నాయి. వీటి నుంచి కొంత వరకైనా ఉపశమనం పొందేందుకు ఇన్స్యూరెన్స్ తీసుకోవడం ఒక ఉత్తమ మార్గం. అయితే ఆరోగ్య, వాహన తదితర బీమాలు ఓకే.. మరి నిరుద్యోగ బీమా గురించి ఎప్పుడైనా విన్నారా?
క్రమశిక్షణా చర్యలు, రాజీనామా మినహా ఇతర కారణాల వల్ల ఎవరైనా ఉద్యోగం కోల్పోతే వారికి ఆర్థిక భద్రతను అందించడానికి నిరుద్యోగ బీమా రూపొందించబడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తన దేశంలోని ఉద్యోగులందరికీ ఈ పథకాన్ని వర్తింప చేస్తోంది. ఇందులో చేరడాన్ని కూడా తప్పనిసరి చేసింది. అక్టోబర్ 1 లోపు సైన్ అప్ చేయని వారికి జరిమానా సైతం విధిస్తామని హెచ్చరించింది.

అసంకల్పిత ఉపాధి బీమా(ILOE)గా పిలవబడే ఈ పథకం.. జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వచ్చింది. కాగా ఇప్పటివరకు 55 లక్షల 34 వేలకు పైగా ఉద్యోగులు ఈ స్కీమ్ లో చేరారు. ఒకవేళ గడువు తేదీ లోపు ఇందులోకి సైన్ చేయని వారికి 400 దిర్హామ్ లు(9 వేలకు పైగా) ఫైన్ విధించనుంది.
నిరుద్యోగ బీమా లబ్ధిదారులు ఒకవేళ ఉద్యోగాలను కోల్పోతే.. వారి సగటు మూల వేతనంలో 60 శాతం వరకు పొందే అవకాశం ఈ ఇన్స్యూరెన్స్ ద్వారా లభిస్తుంది. ప్రతి క్లెయిమ్ ద్వారా గరిష్ఠంగా 3 నెలల పాటు నగదు ప్రయోజనాలు అందించబడతాయి. అయితే క్లెయిమ్ దాఖలు చేయడానికి ఉద్యోగి కనీసం 12 నెలల పాటు వేతనం పొంది ఉండాలి. 30 రోజుల్లోగా తప్పనిసరిగా నిరుద్యోగ కారణానికి రుజువు సమర్పించాల్సి ఉంటుంది.
భారత్ లో ప్రత్యేకంగా నిరుద్యోగ బీమా అనేది లేదు. కానీ ఎంప్లాయిమెంట్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ నుంచి ఈ ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాజీవ్ గాంధీ శ్రామిక్ కళ్యాణ్ యోజన(RGSKY), అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన(ABVKY) పథకాల ద్వారా జాబ్ కోల్పోయిన ఉద్యోగులు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉందంటున్నారు. పూర్తి వివరాల కోసం ESIC వెబ్ సైట్ సందర్శించాలని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications