KTR News: యూఏఈకి చెందిన లులూ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాలను పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో వెల్లడించింది.
ప్రధానంగా కంపెనీ ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, రిటైల్ అవుట్‌లెట్లలో రూ.3,500 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో పండ్లు, కూరగాయలు, పప్పులు, మసాలా దినుసులను ప్రాసెస్ చేయడానికి అత్యాధునిక ఎగుమతి ప్రాసెసింగ్ ప్లాంట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్లు గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎ యూసఫ్ అలీ వెల్లడించారు.

ఆహార ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాసెస్ చేసి వాటి విలువను పెంచేందుకు అత్యాధునిక వసతులను లులూ గ్రూప్ ఏర్పాటు చేస్తోంది. అలాగే హైదరాబాద్ నగరంలో లాజిస్టిక్స్ హబ్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. తెలంగాణలోని అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో చేపల ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు యూసఫ్ అలీ వెల్లడించారు. అలాగే ఇక్కడి బియ్యాన్ని ఎగుమతి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా భారతదేశంలో తెలంగాణ వేగంగా సాధించిన అభివృద్ధి, విజయాలు తనను ఆకట్టుకున్నాయని లులూ గ్రూప్ ఛైర్మన్ వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భూమి కేటాయించిన వెంటనే పనులు ప్రారభిస్తామని స్పష్టం చేశారు. చెంగిచెర్ల దగ్గర రూ.200 కోట్ల పెట్టుబడితో రోజుకు 60 టన్నుల మాంసాన్ని ప్రాసెసింగ్ చేసే ఎక్స్‌పోర్ట్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రానున్న 18 నెలల్లో ఇది వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభిస్తుందని వెల్లడించారు.
దీనికి ముందు దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో రూ.500 కోట్ల మేర పెట్టుబడి పెట్టాలని కంపెనీ నిర్ణయించినప్పటికీ.. దానికి ఏడింతల పెట్టుబడితో నేడు తెలంగాణలో అడుగుపెట్టినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. లులూ గ్రూప్ మెుదటి ప్రాజెక్టులో భాగంగా 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మంజీరా మాల్‌గా పిలవబడే మాల్‌ను లులూ మాల్‌గా మార్చాలని కంపెనీ నిర్ణయించింది. దీనిని సెప్టెంబరు మెుదటి వారంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు యాజమాన్యం వెల్లడించింది.
లులూ మాల్‌తో పాటు మరో మూడు మాల్స్‌ను గ్రూప్ ప్రతిపాదిస్తోంది. ఇందులో హైదరాబాద్‌లో రూ.2,000 కోట్లతో డెస్టినేషన్ షాపింగ్ మాల్, నగరం శివార్లలోని మినీ మాల్స్, రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలు, పట్టణాలు ఉన్నాయి. రెండు నెలల్లో ఈ మాల్స్‌కు భూమిని గుర్తిస్తామని.. అక్కడి నుంచి మాల్స్ ప్రారంభించేందుకు 18-24 నెలల సమయం పడుతుందని చెప్పారు.


Click it and Unblock the Notifications