NPS: ఎన్పీఎస్ చందాదారులకు గమనిక.. వారికి అందుబాటులోకి రెండు కొత్త ఆప్షన్లు..!
కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థల ఉద్యోగులకు జాతీయ పింఛను వ్యవస్థ శుభవార్త చెప్పింది. ఇంతకుముందు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉన్న రెండు అదనపు పెట్టుబడి ఎంపికలు ఇప్పుడు కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థల ఉద్యోగులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థలలో పనిచేస్తున్న ఎన్పీఎస్ చందాదారులకు ఆర్థిక సేవల విభాగం 2025 నవంబర్ 13 నాటి నోటిఫికేషన్ వర్తిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది.
ఈ నిర్ణయం ఎన్పీఎస్(NPS) చందాదారులు తమ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యానికి అనుగుణంగా పదవీ విరమణ పెట్టుబడులకు సంబంధించి ప్రణాళిక అమలు చేసే అవకాశం ఉంటుంది. ఈ పింఛను పథకం పరిధిలోకి వచ్చే కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థల ఉద్యోగులకు అదనపు పెట్టుబడి ఎంపికలు కూడా ఉండనున్నాయి. ఉద్యోగుల కోసం రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో ఒకటి ఎల్సీ-75. ఇది అగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్. ఉద్యోగులు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఇందులో 75 శాతం వరకు ఈక్విటీలో పెట్టుబడి పెట్టొచ్చు. మిగతా బాండ్స్ లో పెట్టుబడి పెట్టొచ్చు.

దీర్ఘకాలం పెట్టుబడి పెట్టేవారికి ఇది అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. సెకండ్ ఆప్షన్.. బీఎల్సీ అంటే అగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్. ఈ ఎంపికలో ఈక్విటీలో కేవలం 50 శాతం వరకు మాత్రమే పెట్టుబడి పెట్టొచ్చు. అంటే రిస్క్ ఉండొద్దు అనుకునేవారికి, అలాగే పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారికి ఈ ఆప్షన్ మంచిదని చెబుతున్నారు. ఈ ఎంపికలో చందాదారునికి 45 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత ఈక్విటీలలో కేటాయింపు క్రమంగా తగ్గుతుంది. ఇది పదవీ విరమణ సమీపిస్తున్న కొద్దీ పోర్ట్‌ఫోలియోను తక్కువ అస్థిరత ఉన్న ఆస్తుల వైపు మళ్లిస్తుంది.
ఈ రెండు ఆప్షన్స్ ఇప్పటికే పలువురికి అందుబాటులో ఉన్నాయి. చందాదారుల విభిన్న రిస్క్-రిటర్న్ ప్రాధాన్యతలకు అనుగుణంగా వీటిని తీసుకొచ్చారు.
కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థల ఉద్యోగులకు ఈ పెట్టుబడి ఎంపికలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల చందాదారులు తమ పింఛను పెట్టుబడులను వారి వ్యక్తిగత రిస్క్ సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాలు, పదవీ విరమణ ప్రణాళిక అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ అదనపు ఆప్షన్లు అందుబాటులోకి తీసుకొస్తూ 2025 నవంబర్ 13న ఆర్థిక సేవల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా నిర్ణయంతో, NPS పరిధిలోకి వచ్చే కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థల ఉద్యోగులు కూడా ఈ పెట్టుబడి ఎంపికలను ఎంచుకోగలుగుతారు.


Click it and Unblock the Notifications