పట్టు వస్త్రాలకు బదులు పాలిస్టర్! తిరుమలలో బయటపడ్డ మరో పెద్ద స్కామ్! ఎవరికీ తెలియని నిజాలు!
భారతదేశంలోని అత్యంత పవిత్రమైన, ధనిక ఆలయ ట్రస్టులలో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వరుస కుంభకోణాలతో మరోసారి వార్తల్లో నిలిచింది. లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ ఆరోపణలు, హుండీ డబ్బుల లెక్కింపు (పరకామణి) చోరీ వంటి వివాదాల తర్వాత తాజాగా రూ. 55 కోట్లకు పైగా విలువైన పట్టు దుపట్టా కొనుగోలు కుంభకోణం (TTD Silk Dupatta Scam) వెలుగులోకి వచ్చింది.
పట్టు పేరుతో పాలిస్టర్ సరఫరా
గత పదేళ్లలో TTDకి సరఫరా అయిన పట్టు శాలువాలు (Pattu Sariga Dupattas) పూర్తిగా నకిలీవని అంతర్గత విజిలెన్స్ విచారణలో తేలింది. ఆలయ పూజలు, దాతలకు సన్మానాలు, ప్రముఖులకు వేదాశీర్వచనం సమయంలో సమర్పించే ఈ దుపట్టాలు స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో ఉండాలి. కానీ, సరఫరాదారులు పట్టు పేరుతో చౌకైన పాలిస్టర్ దుపట్టాలను సరఫరా చేసి, ట్రస్టుకు రూ. 55 కోట్లకు పైగా నష్టాన్ని కలిగించారని విచారణలో గుర్తించారు.

నిబంధలన ఉల్లంఘన..
TTD ఈ ఉత్సవ వస్త్రాల కొనుగోలుకు సంబంధించి కఠినమైన నిబంధనలను కలిగి ఉంది..
- దుపట్టా పూర్తిగా స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో నేయబడి ఉండాలి.
- తప్పనిసరిగా సిల్క్ మార్క్ (Silk Mark) హలోగ్రామ్ కలిగి ఉండాలి.
- ఒక మీటరు వెడల్పు, 2.3 మీటర్ల పొడవు ఉన్న ఈ దుపట్టాపై "ఓం నమో వెంకటేశాయ" అనే తెలుగు, సంస్కృత లిపిలో శంకు, చక్రం, నామం చిహ్నాలు మధ్యలో ముద్రించి ఉండాలి.
- ఒక్కో దుపట్టా కనీసం 180 గ్రాములు బరువు కలిగి ఉండాలి.
ల్యాబ్ టెస్టుల్లో మోసం బట్టబయలు
TTD బోర్డు ఛైర్మన్ బి.ఆర్. నాయుడు ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు తిరుపతి గోదాంలలోని స్టాక్ మరియు తిరుమలలోని వైభవోత్సవ మండపంలోని స్టాక్‌ల నుంచి నమూనాలను సేకరించారు. కేంద్ర పట్టు బోర్డు (Central Silk Board) సహా ఇతర ల్యాబ్‌లలో నిర్వహించిన పరీక్షల్లో ఆ దుపట్టాలు పూర్తిగా పాలిస్టర్‌తో తయారు చేసినవని, తప్పనిసరి అయిన సిల్క్ మార్క్ లేదని తేలింది.
బి.ఆర్. నాయుడు మాట్లాడుతూ, "రూ. 350 విలువైన శాలువాకు రూ. 1,300 బిల్లు వేశారు. గత దశాబ్దంలో మొత్తం సరఫరా విలువ రూ. 50 కోట్లకు పైగా ఉంది. ఈ విషయాన్ని సమగ్ర క్రిమినల్ విచారణ కోసం ఏసీబీ(ACB) కి అప్పగించాం" అని తెలిపారు.
ఈ కుంభకోణానికి ప్రధానంగా ఒకే ఒక కాంట్రాక్టర్ కారణమని తేలింది. ఆ కాంట్రాక్టర్ 2015 నుంచి 2025 వరకు దుపట్టాలను సరఫరా చేసినట్లు అంతర్గత విచారణలో తేలింది. దీంతో TTD ట్రస్ట్ బోర్డు ఆ సంస్థతో ఉన్న అన్ని టెండర్లను రద్దు చేసి.. దర్యాప్తును ఏసీబీకి అప్పగించింది.
TTD పవిత్రతకు భంగం
పాలిస్టర్‌ను ఉపయోగించి మోసం చేయడం వలన TTDకి భారీ ఆర్థిక నష్టం వాటిల్లడమే కాక, ఆలయ నిబంధనలు, పవిత్రతకు భంగం కలిగింది. దాతలు, వీఐపీల కోసం నిర్వహించే వేడుకల్లో కీలక పాత్ర పోషించే ఈ దుపట్టాల ప్రామాణికతపై వచ్చిన ఈ ఆరోపణలు TTD యొక్క ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. వరుసగా జరుగుతున్న ఈ కొనుగోలు వివాదాల నేపథ్యంలో.. TTD తన కొనుగోలు ప్రక్రియల్లో పారదర్శకతను మరింత పెంచాల్సిన అవసరం ఏర్పడుతోంది.


Click it and Unblock the Notifications