Hyderabad: రాష్ట్రానికి టెస్లా, బివైడి కంపెనీలు..! సీఎం రేవంత్ బృందం చర్చలు..
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి నెలలు గడవకు ముందరే తనదైన మార్క్ పాలనను కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యతకు ఏమాత్రం తగ్గకుండానే కార్పొరేట్ కంపెనీలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తూ బిజీగా గడుపుతున్నారు.
ఇండియా రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలని నిర్ణయించిన క్రమంలో టెస్లా, బివైడి వంటి ఎలక్ట్రిక్ వాహన కంపెనీలను తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నంలో రేవంత్ బృందం ఉంది. రాష్ట్రంలో ఈ కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేసేలా చేసేందుకు చర్చలు కొనసాగిస్తున్నారు. దీనికి ముందు అదానీ గ్రూప్, జేఎస్‌డబ్ల్యూ, టాటా టెక్నాలజీస్, బిఎల్ ఆగ్రో తదితర కంపెనీలతో కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ హైదరాబాద్‌లో నాల్గవ పారిశ్రామిక విప్లవం కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కూడా అంగీకరించింది.

జూలై 2023లో హైదరాబాద్‌లో తయారీ యూనిట్‌ను స్థాపించడానికి చైనా EV తయారీదారు BYDకి కేంద్రం అనుమతిని నిరాకరించింది. ఇదే క్రమంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా రెండేళ్లకు పైగా దేశంలోకి ప్రవేశించటానికి ఆసక్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆహ్వానం కూడా పంపిన సంగతి తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా BYD మోటార్స్ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది. మేఘా ఇంజనీరింగ్ సైతం కంపెనీతో తయారీలో జతకట్టేందుకు పెట్టుబడిని సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అమ్మకాల ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BYD, దాని ప్రతిపాదనలో సంవత్సరానికి 10,000-15,000 ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని నిర్ణయించింది. మరోపక్క టెస్లా ప్రస్తుతం దేశంలోకి ప్రవేశించడానికి అధునాతన చర్చల్లో నిమగ్నమైంది. రాబోయే ఐదేళ్లలో సుమారుగా 30 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టే అవకాశాన్ని పరిశీలిస్తోంది. తయారీ కర్మాగారాన్ని నెలకొల్పడం, బ్యాటరీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం, సంబంధిత పరిశ్రమలకు మద్దతివ్వాలని కంపెనీ చూస్తోంది. దీనికి ముందు టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కోసం తక్కువ దిగుమతి పన్నులను కూడా అభ్యర్థించింది. 2030 నాటికి ఇండియా మరిన్ని ఈవీలను వినియోగంలోకి తీసుకురావాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications