Trump's Gold Card: అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులకు ఇది నిజంగా శుభవార్త. ఇకపై చదువు పూర్తయిన తర్వాత కూడా అక్కడే మంచి ఉద్యోగాలు చేసుకునే అవకాశం లభించనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 'గోల్డ్ కార్డ్' విధానం దీనికి మార్గం సుగమం చేయనుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం ఈ విధానం ద్వారా అమెరికాలోని ప్రముఖ కంపెనీలు ప్రతిభావంతులైన విద్యార్థులను తమ సంస్థల్లోనే కొనసాగించుకునే వీలు కలుగుతుందని తెలుస్తోంది.
గోల్డ్ కార్డ్ అంటే ఏమిటి?
ట్రంప్ వైట్ హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో త్వరలోనే అమెరికా ప్రభుత్వం 'గోల్డ్ కార్డ్'ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ గోల్డ్ కార్డ్‌ను ఆపిల్ వంటి దిగ్గజ సంస్థలు ఉపయోగించుకుని తమకు కావాల్సిన నైపుణ్యం కలిగిన ఉద్యోగులను దేశంలోనే ఉంచుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న EB-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ స్థానంలో ఈ 'గోల్డ్ కార్డ్' రానుంది. దీనికోసం విదేశీయులు అమెరికా ఆర్థిక వ్యవస్థలో 5 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

కొన్ని కంపెనీలు తమకు ప్రపంచంలోని అత్యుత్తమ విద్యార్థులను నియమించుకోవాలని కోరుకుంటాయి. అలాంటివారు భారత్, చైనా, జపాన్ వంటి వివిధ దేశాల నుండి వస్తారు. వారు హార్వర్డ్, వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్, యేల్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో చదువుతారు. అయితే ఈ ఉద్యోగులు దేశంలో ఉంటారో లేదో అన్న అనిశ్చితి కారణంగా ప్రముఖ కంపెనీలు వీరిని నియమించుకోవడానికి వెనుకాడుతున్నాయని ట్రంప్ బుధవారం తన రెండవసారి మంత్రివర్గ సమావేశంలో అన్నారు. టాప్ కంపెనీలు ఈ గోల్డ్ కార్డును కొనుగోలు చేస్తో అత్యుత్తమ అంతర్జాతీయ విద్యార్థులను నిలుపుకోవచ్చని, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు మరింత దోహదపడతారని ట్రంప్ అన్నారు.
అమెరికాలోని కంపెనీలు ముఖ్యంగా సిలికాన్ వ్యాలీలోని సంస్థలు, ప్రతిభావంతులైన ఉద్యోగులను ఆకర్షించడంలో, వారిని తమ వద్దే ఉంచుకోవడంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దీనికి ప్రధాన కారణం అక్కడి ఇమ్మిగ్రేషన్ విధానాల్లోని అనిశ్చితి. అందుకే ట్రంప్ అధిక నైపుణ్యాలు కలిగిన లేదా దేశంలో పెట్టుబడులు పెట్టడానికి సంపద కలిగిన చట్టబద్ధమైన వలసదారులను స్వాగతించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం కంపెనీలు గోల్డ్ కార్డ్‌ను కొనుగోలు చేసి, దానిని రిక్రూట్‌మెంట్ కోసం ఉపయోగించుకోవచ్చని బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది.
ట్రంప్ ప్రతిపాదిస్తున్న గోల్డ్ కార్డ్ విజయవంతమైతే అది అమెరికా 35 ట్రిలియన్ డాలర్ల లోటును పూడ్చడానికి సహాయపడుతుందని అంచనా వేయబడింది. ఉదాహరణకు యూఎస్ ఒక మిలియన్ కార్డులు అమ్మితే అమెరికా ప్రభుత్వానికి 5 ట్రిలియన్ డాలర్లు వస్తాయి. ఒకవేళ 10 మిలియన్ గోల్డ్ కార్డులు అమ్మితే ఏకంగా 50 ట్రిలియన్ డాలర్లు వస్తాయి తద్వారా.. అమెరికా 35 ట్రిలియన్ డాలర్ల రుణాన్ని తీర్చడానికి సరిపోతుంది.


Click it and Unblock the Notifications