ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. లొంగకపోతే మొత్తం దేశాన్ని పేల్చివేస్తానంటూ..
పశ్చిమాసియాలో వార్ ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనపడటం లేదు. ఇరాన్- అమెరికా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఉంది. రెండు దేశాలు యుధ్దానికి కాలు దువ్వుతున్నాయే తప్ప శాంతి చర్చలు వైపు తమ అడుగులను పడనీయడం లేదు. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న వార్ ప్రపంచదేశాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోంది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి బులియన్ మార్కెట్ వరకు తీవ్ర ప్రభావం పడుతోంది.
తాజాగా ఇరాన్ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఫాక్స్ న్యూస్ చీఫ్ ఫారిన్ కరస్పాండెంట్ ట్రే యింగ్స్ట్‌తో మాట్లాడిన ట్రంప్.. తాము ప్రస్తుతం ఇరాన్‌పై ఒక నిర్ణయం తీసుకునే స్థితిలో ఉన్నామని (Deciding Mode), సమీప భవిష్యత్తులోనే "చాలా పెద్ద పరిణామాలు" చోటుచేసుకుంటాయని హెచ్చరించారు. ఇరాన్ తమ ప్రవర్తనను మార్చుకోవాలని.. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

అమెరికా ముందు ప్రస్తుతం మూడు ప్రధాన ఎంపికలు ఉన్నాయని ట్రంప్ వర్గీకరించారు. ఇరాన్‌ను సైనికంగా పూర్తిగా ధ్వంసం చేయడం (Annihilate/Wipe out), ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీయడం లేదా ఒక నూతన దౌత్యపరమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం. ఈ ఎంపికలపైనే ప్రస్తుతం వైట్ హౌస్ తీవ్రంగా ఆలోచిస్తోంది. అయితే, న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సాధారణ మహాసభల (UNGA) సమయంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో సమావేశమయ్యేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ సూచనప్రాయంగా వ్యాఖ్యానించడం గమనార్హం.
మరోవైపు పశ్చిమాసియాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై విధిస్తున్న దిగ్బంధనాన్ని తొలగించేందుకు ఇరాన్ తమ షరతులను ఖతార్ మధ్యవర్తుల ద్వారా అమెరికాకు తెలియజేసింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఘాలిబాఫ్, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధిపతి మొహ్సెన్ రెజాయీ వెల్లడించిన వివరాల ప్రకారం.. అన్ని రంగాల్లోనూ యుద్ధాన్ని తక్షణమే ముగించడం, అంతర్జాతీయంగా స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, సైనిక/నావికా దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయడం ఇరాన్ విధించిన ప్రధాన షరతులుగా ఉన్నాయి.
తమ షరతులకు అమెరికా కట్టుబడి ఒప్పందం చేసుకునే వరకు హార్ముజ్ జలసంధిని తెరవడం సాధ్యపడదని ఇరాన్ తేల్చి చెప్పింది. అంతేకాకుండా, ఒకవేళ అమెరికా సైనిక దాడికి దిగితే ఈసారి అంతకంటే శక్తివంతంగా తిప్పికొడతామని ఇరాన్ హెచ్చరించింది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలు, అమెరికా వాణిజ్య ప్రయోజనాలే తమ ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయని.. ఎంతటి నిర్ణయాత్మక యుద్ధానికైనా తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇరాన్ స్పష్టం చేయడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి.


Click it and Unblock the Notifications

