అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ప్రపంచ రాజకీయ వేదికపై తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి. విదేశాంగ విధానం, వాణిజ్యం, వలస విధానాల విషయంలో ట్రంప్ అవలంబిస్తున్న కఠిన వైఖరి ఆయనను అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక వివాదాస్పద నాయకుడిగా మార్చింది. అధిక సుంకాలు విధించడం ద్వారా గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితిని పెంచడమే కాకుండా, అమెరికాలో ఉద్యోగాల కోసం వచ్చే విదేశీ నిపుణులపై ప్రభావం చూపేలా లక్ష డాలర్ల H-1B వీసా ఫీజు ప్రతిపాదన తీసుకురావడం వంటి నిర్ణయాలు భారతదేశాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తున్నాయి.
ఈ మధ్య ట్రంప్ పరిపాలన వెనిజులాపై చేపట్టిన సైనిక చర్యలు మరింత సంచలనంగా మారాయి. వైమానిక దాడులు, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్నట్లు వచ్చిన వార్తలు.. గత కొన్ని దశాబ్దాలుగా పశ్చిమ అర్ధగోళంలో అమెరికా చేపట్టిన అత్యంత కీలక సైనిక చర్యలలో ఒకటిగా నిపుణులు భావిస్తున్నారు. ఈ చర్యల వల్ల ట్రంప్ అంతర్జాతీయ స్థాయిలో తాత్కాలికంగా బలమైన నేతగా కనిపిస్తున్నప్పటికీ, దీర్ఘకాలికంగా అమెరికాకు కలిగే ప్రయోజనాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ట్రంప్‌ను పోలుస్తూ జియోపాలిటిక్స్ నిపుణుడు ఇయాన్ బ్రెమ్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడేతో మాట్లాడిన బ్రెమ్మర్.. ట్రంప్ తీసుకున్న వెనిజులా నిర్ణయాలు స్వల్పకాలిక లాభాలను ఇవ్వవచ్చని అంగీకరించినప్పటికీ, ట్రంప్ పదవీ విరమణ అనంతరం అవి కొనసాగడం కష్టమని అభిప్రాయపడ్డారు. అమెరికాలో ప్రతి నాలుగు సంవత్సరాలకు నాయకత్వం మారే ప్రజాస్వామ్య వ్యవస్థ కారణంగా విధానాల్లో స్థిరత్వం ఉండదని ఆయన స్పష్టం చేశారు.అమెరికా కంపెనీలు వెనిజులా చమురు మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటాయన్న అంచనాలను బ్రెమ్మర్ అతిశయోక్తిగా కొట్టిపారేశారు.
భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ దశాబ్దానికి పైగా బలమైన ప్రజాదరణతో పాలన కొనసాగించడం ఒక ప్రధాన తేడా అని చెప్పారు. చైనా, రష్యా, భారత్ వంటి దేశాల్లో నాయకత్వానికి స్థిరత్వం ఉండగా, అమెరికాలో అది కొరవడిందని ఆయన అన్నారు. తదుపరి అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న చాలా నిర్ణయాలను సులభంగా రద్దు చేయగలడు. ఇది చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కాదు, 10 సంవత్సరాలుగా దేశాన్ని నడుపుతున్న మోడీ కూడా కాదు. ఇది Trump పాలన.. ప్రజాదరణ తక్కువగా ఉన్న నాయకుడు, మూడు సంవత్సరాల్లో పదవి విడిచిపెట్టాల్సి వస్తుందని బ్రెమ్మర్ వ్యాఖ్యానించారు.
వెనిజులా చమురు విషయంలో కూడా బ్రెమ్మర్ స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వెనిజులా రోజుకు సుమారు 8 లక్షల బ్యారెళ్ల చమురు మాత్రమే ఉత్పత్తి చేస్తోందని, ఒకప్పుడు ఇది 30 లక్షల బ్యారెళ్లకు పైగా ఉండేదని గుర్తు చేశారు. చమురు ఉత్పత్తి పెరగాలంటే రాజకీయ స్థిరత్వం, పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించే ఆర్థిక వాతావరణం అవసరమని అన్నారు. అంతేకాదు, చమురు కంపెనీల పెట్టుబడి నిర్ణయాలు అధ్యక్షుడి పదవీకాలం కంటే చాలా దీర్ఘకాలికమైనవని చెప్పారు. ఏదేమైనా ట్రంప్ చర్యలు ప్రపంచ రాజకీయాల్లో తాత్కాలిక ప్రభావం చూపించినప్పటికీ, దీర్ఘకాలికంగా అవి నిలిచేనా అన్నది అనిశ్చితమేనని నిపుణుల అభిప్రాయం.


Click it and Unblock the Notifications