గాలిలో దీపంలా 3 లక్షల ఉద్యోగాలు..ట్రంప్ సుంకాల పోటుతో ఈ కీలక రంగాలు విలవిల
Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై సుంకాల దాడి పెంచిన సంగతి విదితమే. ఈ సుంకాల ఎఫెక్ట్ భారతదేశంలోని కొన్ని కీలక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికాకు ఎగుమతులపై అధిక పన్నులు విధించబడటంతో దేశం మొత్తం మీద 2 లక్షల నుంచి నుంచి 3 లక్షల వరకు ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని పరిశ్రమనిపుణులు అంచనా వేస్తున్నారు.
వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్, హెచ్‌ఆర్ సేవల సంస్థ జీనియస్ హెచ్‌ఆర్‌టెక్ వ్యవస్థాపకుడు, సిఎండి ఆర్‌పి యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడే పరిశ్రమలు సుంకాల పెంపుతో ప్రత్యక్షంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. వ్యవసాయం, ఆటో విడిభాగాలు, రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు వంటి రంగాలు ఎక్కువగా దెబ్బతింటాయని తెలిపారు. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSMEలు) ఈ ప్రభావాన్ని భారీగానే మోయాల్సి వస్తుందన్నారు.

అమలులో ఉన్న సుంకాల కారణంగా ఇప్పటికే 2 లక్షల నుంచి 3 లక్షల మధ్య ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఒకవేళ కొనసాగుతున్న టారిఫ్ విధానం రాబోయే 6 నెలలకు మించిన కాలంలో కొనసాగితే.. ఒక్క వస్త్ర రంగంలోనే కనీసం లక్షమంది ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చే ప్రమాదం ఉందన్నారు. సూరత్, ముంబై వంటి కేంద్రాల్లో రత్నాలు, ఆభరణాలు తయారు చేసే యూనిట్లు ఇప్పటికే అమెరికా మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో పాటు పెరిగిన ఖర్చుల ఒత్తిడిని ఈ కంపెనీలు ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు.
టీమ్‌లీజ్ సర్వీసెస్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రమణియన్ అనంత నారాయణన్ మాట్లాడుతూ.. పరిస్థితి అంతగా తీవ్రమైందిగా కనిపించడం లేదని తెలిపారు.భారతదేశం ప్రధానంగా దేశీయ వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. చైనా మాదిరిగా భారీగా ఎగుమతులకు ఆధారపడలేదు. అందువల్ల US సుంకాల ప్రభావం ఉద్యోగాలపై తక్షణప్రభావాన్ని చూపే అవకాశం తక్కువని తెలిపారు. ప్రస్తుతం అమెరికాకు భారతదేశం చేసే ఎగుమతుల విలువ సుమారు 87 బిలియన్ డాలర్లకు సమానం కాగా, ఇది మొత్తంగా భారత GDPలో సుమారు 2.2 శాతం మాత్రమే అని తెలిపారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలపై సరఫరా అంతగా ప్రభావితమయ్యే అవకాశం లేదని ఆయన చెప్పారు.
CIEL HR మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య మిశ్రా మాట్లాడుతూ.. ప్రస్తుతం విస్తృత స్థాయిలో ఉద్యోగాల్లో కోత జరిగే అవకాశం తక్కువగా ఉందని తెలిపారు. అయితే కంపెనీలు ఇప్పటికే ఖర్చుల నియంత్రణలో భాగంగా కొత్త నియామకాలను నిలిపివేస్తున్నాయన్నారు. ప్రభావం తాత్కాలిక ఉద్యోగాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
సంప్రదాయ ఎగుమతి ఆధారిత రంగాలలోని MSME యూనిట్లపై ఈ ప్రభావం అంతగా పడకపోవచ్చని మెజార్టీ పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి. ఇక యునైటెడ్ కింగ్‌డమ్, ఇతర దేశాలతో సాగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTA) ద్వారా పరిస్థితికి కొంత ఉపశమనం కలిగే అవకాశం కూడా ఉంది. తమ ఉత్పత్తుల ఎగుమతులను ఇతర మార్కెట్లకు మళ్లించేందుకు పరిశ్రమలు ప్రయత్నాలు చేపడుతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.


Click it and Unblock the Notifications