రొయ్యల సాగు రైతులపై ట్రంప్ సుంకాల పిడుగు.. అప్పుల ఊబిలో చిక్కుకుని విలవిల..
భారతదేశంలో రొయ్యల ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్న సంగతి అందరికీ విదితమే. దేశంలో ఎగుమతి అయ్యే రొయ్యలలో 65 శాతానికి పైగా ఏపీలోని రైతులే ఉత్పత్తి చేస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన 50 శాతం దిగుమతి సుంకం (టారిఫ్) కారణంగా ప్రస్తుతం ఈ రంగం తీవ్ర అనిశ్చితిని ఎదుర్కుంటోంది. ఆక్వా సాగు రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం అమెరికా ఇప్పటివరకు భారత రొయ్యల కోసం అతిపెద్ద మార్కెట్‌గా ఉండటమే. ట్రంప్ సుంకాల దాడితో ఎగుమతులు సందిగ్ధంలో పడ్డాయి.
పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున shrimp సాగు జరుగుతుంది. దీనిపై రైతులు మాట్లాడుతూ.. మేము ఎగుమతిదారులపై ఆధారపడి ఉన్నాం. కానీ ఇప్పుడు అమెరికా మార్కెట్లో ధరలు పడిపోవడంతో మాకు తగిన ధర రావడం లేదని నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన రైతు చంద్రశేఖర్ రెడ్డి చెబుతున్నారు. ఒక కిలో రొయ్య ధర 420 రూపాయల నుంచి 310 రూపాయలకు పడిపోయిందని ఆవేదన చెందారు. ఈ తగ్గుదల రైతుల లాభాన్ని పూర్తిగా కుదించిందని వాపోయారు.

రొయ్యల ఫీడ్, ఔషధాలు, విద్యుత్ ఖర్చులు గత రెండేళ్లలో చాలా పెరిగాయి. కానీ మార్కెట్ ధర పడిపోవడం వల్ల రైతులంతా అప్పుల కష్టాల్లో చిక్కుకుంటున్నారని ఆవేదన చెందారు. ప్రతి సీజన్‌కు 4-5 లక్షల రూపాయలు పెట్టుబడి పెడతాం. కానీ ఇప్పుడు పెట్టిన దానికంటే తక్కువ వస్తోందన్నారు బ్యాంకు రుణాలు, ప్రైవేట్ అప్పులు తీరడం కష్టమవుతోందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్ రిటర్న్స్ కు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
GoodReturns Telugu Reporter: రొయ్యల రైతులపై ట్రంప్ 50 శాతం టారిఫ్ ఎఫెక్ట్ ఎలా ఉంది
Farmer Chandra sekhar: ఆంధ్రప్రదేశ్‌లోని రొయ్యల రైతులు ఉత్పత్తి చేసే వనామీ రొయ్యలు (Vannamei Shrimps) ఎక్కువగా అమెరికాకు ఎగుమతి అవుతాయి. అమెరికా మన రొయ్యల కోసం అతిపెద్ద కొనుగోలు దారుగా ఉంది. అక్కడ టారిఫ్ పెరిగితే మన రొయ్యలు ఖరీదెక్కుతాయి, పోటీ తగ్గుతుంది. దీంతో రైతుల నుండి ఎగుమతిదారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడం మొదలుపెడతారు.

GoodReturns Telugu Reporter: రైతు స్థాయిలో తక్షణ ప్రభావం ఏమిటి?
Farmer Chandra sekhar: అమెరికాలో ఖరీదు పెరగడంతో ఎగుమతి తగ్గుతుంది. దీంతో రైతు దగ్గర రొయ్యలకు తక్కువ రేటు దక్కుతుంది.పశుగ్రాసం, విత్తనాలు, ఔషధాలు అన్నీ ఇప్పటికే ఖరీదైనవి. కానీ అమ్మకం ధర తగ్గడంతో రైతు నష్టపోతాడు. ఎగుమతిదారులు కొనే ఉత్సాహం తగ్గడంతో, రైతు రొయ్యలు ఎక్కువ రోజుల వరకు చెరువులోనే ఉంచుకోవాల్సి వస్తుంది. దీని వల్ల పశుగ్రాసం ఖర్చు ఇంకా పెరుగుతుంది.

GoodReturns Telugu Reporter: దీర్ఘకాలంలో పరిస్థితి ఎలా మారవచ్చు?
Farmer Chandra sekhar: అమెరికా మార్కెట్ క్షీణిస్తే, రైతు తన ఉత్పత్తికి కొత్త మార్కెట్లను కొత్తగా వెతుక్కోవాల్సి వస్తుంది. దీంతో ఖర్చు పెరిగి, రేట్లు తగ్గిపోతే చాలా మంది రైతులు రొయ్యల సాగును మానేయొచ్చు. రొయ్యల సెక్టార్‌పై ఆధారపడి ఉన్న ఫీడ్ మిల్లులు, హ్యాచ్‌రీస్, ఐస్ ప్లాంట్లు, రవాణా తీవ్రంగా ప్రభావితం అవుతాయి.
GoodReturns Telugu Reporter: రొయ్య రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏవి?
Farmer: ప్రతి కిలో రొయ్యకు రైతుకు వచ్చే ధర 40 రూపాయల నుంచి 60 రూపాయల వరకు తగ్గిపోయింది. పైగా పశుగ్రాసం, ఔషధాలు, విద్యుత్ ఖర్చు పెరిగింది.ఈ సాగు కోసం తీసుకున్న రుణాలు తీర్చలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. టారిఫ్‌లు ఎప్పుడైనా పెరుగుతాయా, తగ్గుతాయా అన్న అనిశ్చితిలో రైతు భయపడుతున్నాడు.

GoodReturns Telugu Reporter: రైతుల పక్షాన ప్రభుత్వం ఏం చేయాలి?
Farmer Chandra sekhar: రైతు ఉత్పత్తిని నష్టాలు రాకుండా కనీసం ఒక స్థిరమైన ధరకు కొనుగోలు చేసేలా ప్రభుత్వ విధానం ఉండాలి. అమెరికా కాకుండా యూరప్, మధ్యప్రాచ్యం, జపాన్, చైనా వంటి మార్కెట్లలో భారత రొయ్యలకు అవకాశాలు కల్పించేలా కేంద్రం చొరవ తీసుకోవాలి. ఫీడ్, విద్యుత్, మెడిసిన్ ఖర్చులపై ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తే రైతుపై భారం చాలా వరకు తగ్గుతుంది. అలాగే అధిక దిగుబడి, తక్కువ ఖర్చుతో సాగు చేసే మార్గాలను రైతులకు నేర్పాలి.ఎగుమతిదారులకు సబ్సిడీ ఇచ్చి, రైతుల నుండి మంచి ధరకు కొనుగోలు చేయాలని వారిని మోటివేట్ చేయాలి.

GoodReturns Telugu Reporter: రైతులకు ఇప్పుడున్న ఆందోళనలు ఏంటి ?
Farmer Chandra sekhar: మేము రాత్రింబవళ్లు కష్టపడి రొయ్యలు పెంచుతున్నాం. కానీ అమెరికా టారిఫ్‌ల కారణంగా ఎగుమతిదారులు మన రొయ్యలకు తక్కువ ధర ఇస్తున్నారు.పశుగ్రాసం, ఔషధాల ధరలు పెరిగాయి. కానీ అమ్మకపు ధర తగ్గిపోవడంతో మాకు నష్టం తప్పడం లేదు.ప్రభుత్వం కనీస ధర హామీ ఇవ్వాలి. లేదంటే రొయ్యల రైతులు ఒక్కొక్కరుగా సాగు మానేయాల్సి వస్తుంది. కొత్త మార్కెట్లు తెరవకపోతే మేము చేసిన ఉత్పత్తి అంతా వృథా అవుతుంది

GoodReturns Telugu Reporter: ఈ సంక్షోభం నుండి రైతులు గట్టెక్కే పరిస్థితులు ఉన్నాయా..
Farmer Chandra sekhar: ఉన్నాయి. రైతులు ప్రభుత్వ సబ్సిడీలు, మద్దతు ధర చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ఎగుమతి మార్కెట్లలో ప్రవేశం చాలా ముఖ్యం.ఖర్చు తగ్గించే పద్ధతులు రైతులకు మంచి ఉపశమనం ఇస్తాయి.
ఏదేమైనా ట్రంప్ విధించిన టారిఫ్‌లు ఏపీ రొయ్యల రైతులపై పెద్ద ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే లాభాలు తగ్గిపోతున్న సమయంలో కొత్త సుంకాలు రైతుల భారం మరింత పెంచాయి. ఈ పరిస్థితుల్లో రైతులు బతకడానికి ప్రభుత్వ సహాయం, కొత్త మార్కెట్లు, ఉత్పత్తి ఖర్చు తగ్గింపు తప్పనిసరి అని రైతులు అంటున్నారు. రొయ్యల రంగం కేవలం రైతులకే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకూ బలమైన ఆధారం. కాబట్టి రైతుల గళం వినిపించేలా, వారి పక్షాన న్యాయం జరిగేలా చూడటం ఇప్పుడు అత్యవసరం.
భారతదేశంలో అతిపెద్ద రొయ్యల ఎగుమతిదారుల జాబితా
ఇక్కడ దేశంలో అతిపెద్ద రొయ్యల ఎగుమతిదారుల జాబితా ఉంది:
ఫాల్కన్ మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్
అంజనేయ సీ ఫుడ్స్
అవంతి ఫీడ్స్
కోరల్ ఎక్స్‌పోర్ట్స్
అమర్త్ ఫిష్ వరల్డ్
ఆనంద ఫీడ్
అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్
అక్వారియస్ సీ ఫుడ్
AVR మెరైన్స్ ప్రైవేట్ లిమిటెడ్
భార్గవి ఎంటర్‌ప్రైజె


Click it and Unblock the Notifications