ట్రంప్ దెబ్బకు పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. కొనుగోలు చేయలేక లబోదిబోమంటున్న పసిడి ప్రియులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు పసిడి ప్రియుల పాలిట శాపంలా మారుతున్నాయి. బంగారం ధరలు నింగిని తాకుతున్నాయి. ఇప్పట్లో బంగారం ధరలు తగ్గే సూచనలు కనపడటం లేదు. గ్రీన్ ల్యాండ్ మీద డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక అంతర్జాతీయంగా పెట్టుబడిదారులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో వారు డాలర్ మీద పెట్టుబడులను వదిలేసి బంగారం మీదకు తరలిస్తున్నారు. దీంతో పసిడి ధరలకు రెక్కలు వస్తున్నాయి.
అమెరికా-యూరోప్ మధ్య వాణిజ్య సంబంధాల్లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగే సూచనలు కనిపించడంతో.. ప్రపంచ మార్కెట్లలో పెట్టుబడిదారులు రిస్క్ తీసుకునే ధోరణి నుంచి వెనక్కి తగ్గారు. ఈ పరిస్థితుల్లో సంప్రదాయంగా సురక్షిత పెట్టుబడులుగా పరిగణించబడే Gold, వెండి ధరలు రికార్డు స్థాయిలను తాకాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడానికి అంగీకరించకపోతే యూరోపియన్ దేశాలపై కొత్తగా సుంకాలు విధిస్తామని మరోసారి హెచ్చరించడంతో మార్కెట్లలో అనిశ్చితి మరింత పెరిగింది.

ట్రంప్ వ్యాఖ్యల అనంతరం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. డాలర్‌తో పాటు ఇతర రిస్క్ ఆస్తుల నుంచి పెట్టుబడిదారులు నిష్క్రమిస్తూ.. తమ పెట్టుబడులను భద్రంగా నిలుపుకునేందుకు బంగారం, వెండి వైపు మొగ్గుచూపారు. ఈ సేఫ్-హేవెన్ డిమాండ్ కారణంగా స్పాట్ Gold ధర ఔన్సుకు సుమారు 4,670 డాలర్ల స్థాయికి చేరింది. ఇది ఇటీవల నమోదైన ఆల్-టైమ్ హైకి చాలా దగ్గరగా ఉండటం గమనార్హం. అదే సమయంలో అమెరికాలో ఫిబ్రవరి డెలివరీకి సంబంధించిన బంగారం ఫ్యూచర్స్ కూడా గణనీయంగా పెరిగాయి.
వెండి ధరలు కూడా ఇదే బాటలో వెళ్లాయి. స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు సుమారు 93.85 డాలర్లను దాటుతూ జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. పారిశ్రామిక లోహంగా కూడా ప్రాముఖ్యత కలిగిన వెండిపై డిమాండ్ పెరగడం, బంగారంతో పాటు ఇది కూడా భద్ర ఆస్తిగా మారడం ధరల ర్యాలీకి దోహదపడింది.
ఈ పరిణామాలపై యూరోపియన్ యూనియన్ కూడా అప్రమత్తంగా స్పందించింది. ట్రంప్ సుంకాల హెచ్చరికలను EU తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు యూరోపియన్ రాయబారవేత్తలు తెలిపారు. అవసరమైతే ప్రతిస్పందనాత్మక చర్యలు తీసుకోవడానికి, అలాగే అమెరికా విధించే సుంకాల ప్రభావాన్ని తగ్గించే మార్గాలను అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నట్లు వారు సంకేతాలు ఇచ్చారు. ఈ పరిణామం అమెరికా-యూరోప్ మధ్య వాణిజ్య యుద్ధ భయాలను మరింత బలపరిచింది.
ఇదిలా ఉండగా, ఫెడరల్ రిజర్వ్ విధాన దృక్పథంపై కూడా మార్కెట్లు దృష్టి సారించాయి. ఫెడ్ వైస్ చైర్ మిషెల్ బోమన్ మాట్లాడుతూ, ప్రస్తుతం బలంగా కనిపిస్తున్న ఉద్యోగ మార్కెట్ అకస్మాత్తుగా బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అవసరమైతే వడ్డీ రేట్లను మళ్లీ తగ్గించేందుకు ఫెడరల్ రిజర్వ్ సిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు. ఈ వ్యాఖ్యలు కూడా బంగారం ధరలకు మద్దతుగా నిలిచాయి. ఎందుకంటే తక్కువ వడ్డీ రేట్లు సాధారణంగా విలువైన లోహాలకు అనుకూలంగా పనిచేస్తాయి.
అంతర్జాతీయంగా చూస్తే.. చైనా ఆర్థిక వృద్ధి గణాంకాలు కూడా పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చైనా వృద్ధి మూడు సంవత్సరాల కనిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందన్న అంచనాలు గ్లోబల్ డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక అనిశ్చితి పెరిగి, పెట్టుబడిదారులు మరింతగా బంగారం, వెండి వంటి భద్ర ఆస్తుల వైపు మళ్లుతున్నారు.
భారతదేశంలో మాత్రం బంగారం డిమాండ్ కొంత స్థిరంగా ఉంది. ధరలు ఇప్పటికే రికార్డు స్థాయిల వద్ద ఉండటంతో వినియోగదారులు ఆభరణాల కొనుగోళ్ల విషయంలో కొంత వెనుకడుగు వేస్తున్నారు. అయినప్పటికీ, చైనా లూనార్ న్యూ ఇయర్ నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది. ప్లాటినమ్ వంటి ఇతర విలువైన లోహాలు కూడా స్వల్ప లాభాలను నమోదు చేశాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications