ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ యవనికపై అత్యంత సంచలనాత్మక అంశంగా మారిన ఇరాన్-అమెరికా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. గురువారం నాడు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ఇప్పుడు ముగింపు దశకు చేరుకుందని.. అమెరికా తన లక్ష్యాలను సాధించడంలో సఫలీకృతమైందని పేర్కొన్నారు.
ఐదవ వారంలో కొనసాగుతున్న ఈ సంఘర్షణ ప్రజల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్న నేపథ్యంలో.. రాబోయే రెండు మూడు వారాల్లో యుద్ధం పూర్తిగా ముగుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ తక్కువ కాల వ్యవధిలోనే ఇరాన్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తామని, వారిని తిరిగి రాతియుగానికి పంపిస్తామంటూ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల ఆమోద రేటింగ్‌లు తగ్గుతున్న తరుణంలో, అమెరికన్ల భద్రతే తన ప్రాధాన్యతని చాటుతూనే, ఈ యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ముప్పు లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

చమురు సంక్షోభం గురించి ప్రస్తావిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలకు ఇరాన్ అనుసరిస్తున్న దుర్మార్గపు విధానాలే కారణమని Trump విమర్శించారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిని అడ్డుకోవడం ద్వారా ఇరాన్ అంతర్జాతీయ వాణిజ్యానికి విఘాతం కలిగిస్తోందని మండిపడ్డారు. ఇంధన కొరతతో బాధపడుతున్న దేశాలు ఇరాన్ వైపు చూడకుండా నేరుగా అమెరికా నుండే చమురు కొనుగోలు చేయాలని లేదా జలసంధికి వెళ్లి స్వేచ్ఛగా తీసుకోవాలని ఆయన సూచించారు.
అమెరికా వద్ద 'డ్రిల్, బేబీ, డ్రిల్' కార్యక్రమం ద్వారా పుష్కలమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయని.. తమ కాళ్ల కింద ఉన్న సహజ వనరులతో శక్తి రంగంలో అమెరికా అగ్రగామిగా ఉందని గుర్తుచేశారు. ఇటీవల పెరిగిన పెట్రోల్ ధరలు కేవలం తాత్కాలికమేనని, ఇరాన్ చేస్తున్న ఉగ్రవాద చర్యల వల్లే ఈ అస్థిరత ఏర్పడిందని ఆయన వివరించారు.
ఇరాన్ అణ్వాయుధ సంపాదనను అడ్డుకోవడమే 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ప్రధాన ఉద్దేశమని ట్రంప్ స్పష్టం చేశారు. గత 47 ఏళ్లుగా ఇరాన్ ప్రభుత్వం అమెరికా - ఇజ్రాయెల్‌లకు వ్యతిరేకంగా చేస్తున్న నినాదాలను, సాగిస్తున్న దాడులను ఆయన ఏకరువు పెట్టారు. 1983 నాటి బీరుట్ బాంబు దాడి నుండి నేటి అక్టోబర్ 7 నాటి రక్తపాత దురాగతాల వరకు అన్నింటి వెనుక ఇరాన్ ఏజెంట్లు ఉన్నారని ఆరోపించారు.
ఇరాన్‌ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటిగా అభివర్ణిస్తూనే, అణ్వాయుధాల విషయంలో ఆ దేశాన్ని ఎన్నటికీ విశ్వసించలేమని తేల్చి చెప్పారు. అణ్వాయుధ ఇరాన్ అనే 'క్యాన్సర్'ను వదిలించుకోవడానికి అమెరికా ఆర్థికంగా, సైనికంగా ఇంతకంటే మెరుగ్గా ఎప్పుడూ లేదని, తమ బలమైన ఆర్థిక వ్యవస్థ ఈ యుద్ధం వల్ల కలిగే చిన్నపాటి కుదుపులను సులభంగా ఎదుర్కొంటుందని పేర్కొన్నారు.
ఏదేమైనా ట్రంప్ ప్రసంగం యుద్ధం పట్ల అమెరికన్లలో ఉన్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నంలా కనిపిస్తోంది. యుద్ధం పరిమితమైనదని, త్వరలోనే ముగిసిపోతుందని చెప్పడం ద్వారా ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించే ప్రయత్నం చేశారు. ఇరాన్ పురోగతిని అడ్డుకుంటూనే, ప్రపంచ భద్రత స్వేచ్ఛా ప్రపంచం కోసం ఈ చర్య అత్యవసరమని ఆయన గట్టిగా వాదించారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా ఇరాన్ ముప్పును శాశ్వతంగా తొలగిస్తామని ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించారు.


Click it and Unblock the Notifications