లక్ష కాదు రెండు లక్షల డాలర్లు.. H-1B Visaపై ట్రంప్ మరో బాంబు..భారతీయ IT ఉద్యోగులకు బిగ్ షాక్..
Trump's H-1B Fee Plan: అమెరికాలో ఉద్యోగం చేయాలలనుకునే వారు ఇక ఆశలు వదిలేసుకోండి.. విదేశీయులు ఉద్యోగం పేరుతో అమెరికాలో అడుగుపెట్టే ధైర్యం చేయకుండా డొనాల్డ్ ట్రంప్ కఠిన నియమాలను తీసుకువస్తున్నారు. ఇప్పటిదాకా లక్ష డాలర్ల ఫీజుతో బెంబేలెత్తించిన ట్రంప్ దాన్ని ఏకంగా రెండు లక్షల డాలర్లకు పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి బిగ్ షాక్ తగలబోతోంది.
విదేశాల నుండి కొత్తగా హెచ్-1బి (H-1B) ఉద్యోగులను దేశంలోకి తీసుకురావడానికి అయ్యే ఖర్చును ఊహించని రీతిలో పెంచేందుకు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ప్రచురించిన ఫెడరల్ రిజిస్టర్ ప్రకటన ప్రకారం.. అమెరికా వెలుపల నుండి వచ్చే ప్రతీ కొత్త H-1B దరఖాస్తుదారుపై అదనంగా 103,265 డాలర్ల (సుమారు రూ. 86 లక్షలు) రుసుమును విధిస్తూ ప్రతిపాదనలు చేసింది.

గతంలో ప్రభుత్వం సవాలు చేసిన 100,000 డాలర్ల రుసుము గనక న్యాయస్థానంలో నిలబడితే.. విదేశాల నుండి ఒక కొత్త H-1B ఉద్యోగిని స్పాన్సర్ చేయడానికి అమెరికన్ కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం రుసుము 203,265 డాలర్లు అంటే రూ. 1.70 కోట్లు దాటే అవకాశం ఉందని యూఎస్‌ఏ టుడే నివేదిక స్పష్టం చేసింది. H-1B ప్రోగ్రామ్‌ను మరింత ఖరీదైనదిగా, పరిమితులతో కూడినదిగా మార్చేందుకు అమెరికా ప్రభుత్వం చేపడుతున్న విస్తృత వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం వెలువడింది.
ఈ భారం కేవలం సాంకేతిక దిగ్గజాలపైనే కాక.. విదేశీ నిపుణులపై ఆధారపడే విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. గతంలో విధించిన 100,000 డాలర్ల రుసుమును మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టు కొట్టివేయగా.. దానిపై ప్రభుత్వం అప్పీల్ చేసింది. ప్రస్తుతం ఆ విచారణ కొనసాగుతుండగానే, అమెరికా వలస వ్యవస్థ నిర్వహణకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి ఈ కొత్త 103,265 డాలర్ల ఛార్జీని తెరపైకి తెచ్చినట్లు డిహెచ్‌ఎస్ పేర్కొంది.
రాబోయే దశాబ్ద కాలంలో ఈ రుసుముల ద్వారా సుమారు 8.8 బిలియన్ డాలర్ల రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రతి ఏటా కేటాయించే 85,000 వీసాల కోసం తీవ్రమైన పోటీ నెలకొంటున్న తరుణంలో, అమెజాన్, యాపిల్, గూగుల్, మెటా వంటి బహుళజాతి సంస్థలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే ఆసుపత్రులు ఈ ప్రతిపాదనల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కఠిన ప్రతిపాదనల వల్ల భారతీయ ఐటీ నిపుణులకు భారీగా ప్రతికూల పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఆమోదం పొందుతున్న మొత్తం H-1B వీసాలలో 70 శాతానికి పైగా భారతీయ పౌరులకే లభిస్తున్నాయి.
విదేశాల నుండి నేరుగా అమెరికా వెళ్లి పనిచేయాలనుకునే భారతీయ టెక్ ఉద్యోగులకు 200,000 డాలర్లకు పైగా ఫీజు కావడం వల్ల.. అనేక కంపెనీలు స్పాన్సర్‌షిప్‌లను తగ్గించుకునే ప్రమాదం ఉంది. అయితే, ఈ కొత్త రుసుము కేవలం దేశం వెలుపల నుండి వచ్చే కొత్త దరఖాస్తుదారులకే వర్తిస్తుందని, ఇప్పటికే అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదివి ఉద్యోగాల్లో చేరే విద్యార్థులకు, అలాగే దేశంలోనే ఉన్న వీసాదారులకు వేర్వేరు నిబంధనలు ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై సెప్టెంబర్ 24 వరకు ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ కొనసాగుతుండగా, తుది నిర్ణయం వెలువడితే అమెరికా వలస విధానంలో ఇది ఒక చారిత్రాత్మక మార్పుగా నిలవనుంది.


Click it and Unblock the Notifications

