భారత రియల్ ఎస్టేట్ రంగానికి వరంగా మారిన ట్రంప్ టారిఫ్స్..ఇళ్ల ధరలు భారీగా తగ్గే అవకాశం
Real Estate News : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అదనపు 25 శాతం సుంకాలు ఆగస్టు 27, బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో భారత ఉత్పత్తులపై అమెరికా మొత్తం సుంకం 50 శాతానికి చేరింది. ఈ పరిణామం వాణిజ్యం, ఆర్థిక రంగాలలో అలజడిని రేపింది. అనేక పరిశ్రమల మాదిరిగానే.. భారతదేశ రియల్ ఎస్టేట్ రంగం కూడా దీనికి సిద్ధమవుతోంది.ట్రంప్ సుంకాల దాడి రియల్ ఎస్టేట్ రంగానికి ప్రతికూల ప్రభావమే అనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సుంకాల కారణంగా ప్రపంచ సరఫరా గొలుసులు (supply chains) మార్పు చెందవచ్చు. దీని వలన నిర్మాణ సామగ్రి ధరలు తగ్గే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో డెవలపర్లకు ఇది ఖర్చు తగ్గింపుగా మారి, గృహాల ధరలను మరింత సరసమైన స్థాయిలో అందించే అవకాశం ఉందని చెబుతున్నారు.
బేసిక్ హోమ్ లోన్ CEO, సహ వ్యవస్థాపకుడు అతుల్ మోంగా మాట్లాడుతూ.. మొదట్లో ట్రంప్ సుంకాలు భారత గృహరంగానికి ఒక ఎదురుదెబ్బలా అనిపించవచ్చు. కానీ దగ్గరగా పరిశీలిస్తే, ముఖ్యంగా సరసమైన గృహాల మార్కెట్‌కు అంచనాలు ఇంకా సానుకూలంగానే ఉన్నాయి. ప్రభుత్వ సబ్సిడీలు EMI భారాన్ని తగ్గిస్తున్నాయి. తక్కువ ఆదాయ వర్గాల ప్రజలకు ఇది పెద్ద ఊరటనిస్తుందని చెబుతున్నారు.
మోంగా అభిప్రాయం ప్రకారం చూసుకున్నట్లయితే ప్రపంచ సరఫరా గొలుసులలో మార్పులు నిర్మాణ సామగ్రి ఖర్చులను తగ్గించగలవు. అంతేకాకుండా, తయారీ, ఆటోమొబైల్ రంగాలలో ఉద్యోగాలు పెరగడం వలన, ఎక్కువ మంది వినియోగదారులు పెద్ద గృహ రుణాలకు అర్హత సాధించే అవకాశముంది. ప్రపంచ వాణిజ్యం తాత్కాలిక అంతరాయాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ.. భారతదేశంలో బలమైన దేశీయ డిమాండ్, విధాన పరమైన మద్దతు, స్థిరమైన పరిశ్రమ చట్రాలు ఉన్నందున..గృహనిర్మాణ కల అంతరాయం లేకుండా ముందుకు సాగుతుందని నిపుణులు చెబుతున్నారు.
సుంకాల ప్రభావం కొనసాగితే, వృద్ధికి మద్దతుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)వడ్డీ రేట్లను తక్కువగా ఉంచే అవకాశం ఉంది. దీని వలన EMIలు పెరగవు. గృహ కొనుగోలు కోసం రుణాలు తీసుకోవడం వినియోగదారులకు సులభంగా ఉంటుంది.ఇటీవలి ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో RBI రెపో రేటును 5.5 శాతం వద్దే కొనసాగించింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇప్పటికే 100 బేసిస్ పాయింట్ల రేటు కోత ఇచ్చినందున, MPC ఏకగ్రీవంగా రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించిందని తెలిపారు.

అయితే, ద్రవ్యోల్బణ ఒత్తిడి ఇంకా తగ్గలేదని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. SBI తాజా నివేదిక ప్రకారం, రాబోయే అక్టోబర్ 2025 సమావేశంలో RBI రేటు కోత చేసే అవకాశం తక్కువ. డిసెంబర్‌లో కూడా రేటు తగ్గింపు కష్టమేనని నివేదిక హెచ్చరించింది. దీనికి కారణం, FY26 తొలి రెండు త్రైమాసికాలలో ధరల ఒత్తిడి, ఆర్థిక వృద్ధి చుట్టూ ఉన్న అనిశ్చితి అని చెప్పవచ్చు.
మొత్తం మీద, ట్రంప్ సుంకాల తక్షణ ప్రభావం భారత రియల్ ఎస్టేట్ రంగానికి ప్రతికూలంగానే కనిపించినా.. సరఫరా గొలుసుల పునర్వ్యవస్థీకరణ, ప్రభుత్వ సబ్సిడీలు, తక్కువ వడ్డీ రేట్లు, దేశీయ డిమాండ్ వంటి అంశాలు దీన్ని అవకాశంగా మార్చగలవని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications