చివరి నిమిషంలో ట్రంప్‌కు ఏమైంది.. ఇరాన్‌పై సైనిక దాడికి బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటన.. భయపడ్డారంటున్న టెహ్రాన్..
ఇరాన్‌పై మంగళవారం జరపాల్సిన సైనిక దాడిని వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' ద్వారా ప్రకటించారు. టెహ్రాన్‌తో తీవ్రమైన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. మధ్యప్రాచ్యంలోని కీలక మిత్రదేశాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాల నాయకులు అమెరికాను సంప్రదించి, చర్చల ద్వారా ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావించడం వల్లే దాడిని ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ట్రంప్ వివరించారు. అమెరికాకు ప్రయోజనకరంగా ఉండేలా, ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాలను పొందకుండా నిలువరించేలా ఈ ఒప్పందం ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అయితే, దాడి వాయిదా పడినప్పటికీ ఇరాన్‌పై సైనిక ఒత్తిడిని ట్రంప్ తగ్గించలేదు. ఒకవేళ చర్చలు విఫలమై, సరైన ఒప్పందం కుదరని పక్షంలో ఏ క్షణంలోనైనా ఇరాన్‌పై పూర్తిస్థాయి, భారీ ఎత్తున వైమానిక, సైనిక దాడులు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డానియల్ కేన్‌లను ఆదేశించారు. గత వారాంతంలో కూడా ట్రంప్ స్పందిస్తూ..ఇరాన్‌కు సమయం ముగిసిపోతోంది, వారు వేగంగా కదలడం మంచిది, లేకపోతే వారి ఉనికికే ప్రమాదం అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సంక్షోభంలో తెరవెనుక తీవ్రమైన దౌత్యపరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ఇరాన్‌పై దాడులు ప్రారంభించడంతో ఈ యుద్ధం మొదలైంది. ఆ తర్వాత పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఏప్రిల్ 8న కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ప్రస్తుతం అమలులో ఉంది.
ఇరాన్ తన తాజా ప్రతిపాదనలను పాకిస్తాన్ ద్వారా అమెరికాకు చేరవేసినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ ధృవీకరించారు. ఇరాన్ తన పౌర అణు కార్యక్రమాలకు సంబంధించి కొన్ని రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. కాగా.. చర్చల సమయంలో ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలను సడలించడానికి అమెరికా అంగీకరించిందని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు అంతర్జాతీయంగా కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (హార్ముజ్ జలసంధి) గుండా వెళ్లే ఇంటర్నెట్ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లకు ప్రత్యేక అనుమతులు (పర్మిట్లు) తప్పనిసరి చేస్తామని ఇరాన్ విప్లవాత్మక గార్డ్స్ (IRGC) హెచ్చరించడం ఉద్రిక్తతలను పెంచింది. ఈ జలసంధిని నిరంతరం తెరిచి ఉంచాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులతో ట్రంప్ ఇటీవల చర్చించారు.
చమురు రవాణా మార్గాలపై అనిశ్చితి కారణంగా ప్రపంచ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 107 డాలర్ల వద్ద హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. Trump హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వ ఛానెళ్లు దీనిని అమెరికా "భయంతో వెనకడుగు వేసింది" అని ప్రచారం చేస్తుండగా.. అమెరికా రక్షణ శాఖ మాత్రం ఏ క్షణంలోనైనా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications
