COVID 19: వేలకోట్లు.. సరిపోదు, చైనా నుండి భారీ పరిహారానికి ట్రంప్ డిమాండ్
కరోనా మహమ్మారి చైనాలోని వూహాన్ నుండి పుట్టిందని ప్రపంచంలోని ఎక్కువ దేశాలు విశ్వసిస్తున్నాయి. ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మిగతా దేశాల కంటే మరిన్ని అడుగులు ముందుకేసి చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా చైనాలోనే పుట్టిందని, వారే పుట్టించారని మండిపడుతున్నారు. చైనా చేసిన నిర్లక్ష్యానికి ఇప్పుడు యావత్ ప్రపంచం అతలాకుతలమవుతోందని మండిపడ్డారు. ట్రంప్ మరో షాకింగ్ ప్రకటన కూడా చేశారు.

కరోనా పుట్టిన చోటే నాశనం చేయడంలో చైనా విఫలం
చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ను గుర్తించిన మొదట్లోనే ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో, దానిని తుదముట్టించేందుకు చైనా చేసిన ప్రయత్నాలు ఏవీ లేవని ట్రంప్ ఆగ్రహించారు. గత ఏడాది చివరలో వూహాన్‌లో మొదటిసారి పుట్టుకువచ్చిన వైరస్ విషయంలో ఏం జరిగిందనే అంశంపై సీరియస్‌గా దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశోధన తర్వాత తేలుతుందని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి నిరోధంలో చైనా విఫలమైందన్నారు.

పరిహారం చెల్లించాలి
కరోనా మహమ్మారిని మూలం వద్దే తుదముట్టించడంలో చైనా విఫలమైందని, ఇందుకు ఆ దేశం పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. వైట్ హౌస్ వద్ద ట్రంప్ మాట్లాడుతూ... 'కరోనా అంశంపై మేం సీరియస్‌గా విచారణ జరుపుతున్నాం. చైనా తీరు పట్ల మేం ఏ మాత్రం సంతోషంగా లేము. ప్రస్తుత పరిస్థితి తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ఎందుకంటే ఇది వూహాన్‌లోనే నాశనం చేసే అవకాశం ఉంది. అప్పుడు ప్రపంచమంతా ప్రస్తుత పరిస్థితి ఉండకపోయేది' అన్నారు.

జర్మనీ కంటే భారీ పరిహారం వసూలు చేస్తాం
ఈ సందర్భంగా ఓ విలేకరి ప్రశ్నిస్తూ.. జర్మనీ 160 బిలియన్ డాలర్ల పరిహరం కోరుతోంది కదా అన్నారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ.. అంతకంటే ఎక్కువే చైనా నుండి వసూలు చేస్తామని చెప్పారు. జర్మనీ కంటే సులభ మార్గాన్ని ఎంచుకుంటామని చెప్పారు. చైనా దేశ నాయకులను బాధ్యులుగా చేసేందుకు ఎన్నో మార్గాలు, కారణాలు ఉన్నాయన్నారు. కరోనాతో ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనమయ్యాయని, అందుకే భారీ మొత్తాన్ని రాబట్టే దిశగా ముందుకు వెళ్తామన్నారు. ఎంతమొత్తం అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. ఈ మొత్తం భారీగానే ఉంటుందన్నారు.


Click it and Unblock the Notifications