రాత్రికి రాత్రే దాడులు.. సీజ్‌ఫైర్ ముగిసిందని ట్రంప్ ప్రకటన.. పశ్చిమాసియాలో అసలేం జరుగుతోంది..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో తాత్కాలిక ఒప్పందం ముగిసిందని చేసిన తాజా ప్రకటన మధ్యప్రాచ్యంలో సరికొత్త ఆందోళనకు తెరలేపింది. సుమారు మూడు వారాల క్రితం జూన్ 17న ఫ్రాన్స్‌లోని వెర్సైల్స్‌లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి.. చర్చల ద్వారా ముందుకు సాగాలనే ఉద్దేశంతో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని చెప్పడంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు వణుకుతున్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వంలోని అమెరికా బృందం ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించే సాంకేతిక ఒప్పందాల కోసం 60 రోజుల గడువుతో చర్చలు జరుపుతున్నప్పటికీ, ఈ చర్చలు చాలా నెమ్మదిగా సాగడంతో ట్రంప్ ఈ ఒప్పందం ముగిసిపోయిందని ప్రకటించారు. ట్రంప్ చేసిన తాజా ప్రకటన క్షేత్రస్థాయిలో తీవ్ర పర్యవసానాలకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఈ తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో.. గతంలో పలుమార్లు మధ్యవర్తులుగా వ్యవహరించిన పాకిస్తాన్, ఖతార్ వంటి దేశాలు ఈ ఒప్పందాన్ని కాపాడటానికి మళ్లీ దౌత్యపరమైన ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ దేశాల చొరవ సఫలమైతే నిలిచిపోయిన చర్చలు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. అయితే మరోవైపు ఈ ఒప్పందం ముగిసిందని అమెరికా ప్రకటించడం ఇజ్రాయెల్‌కు ఒక పెద్ద వ్యూహాత్మక అవకాశంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
అమెరికా-ఇరాన్ చర్చలపై మొదటి నుంచీ పూర్తి విశ్వాసం లేని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఈ అనిశ్చితిని ఆసరాగా చేసుకుని సైనిక చర్యలను మరింత తీవ్రతరం చేయవచ్చు. ముఖ్యంగా లెబనాన్‌లోని హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ తన పోరాటాన్ని ముమ్మరం చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా, అవసరమైతే ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ భూభాగంలోనే సైనిక చర్యలకు దిగవచ్చని, అలా జరిగితే పశ్చిమ ఆసియాలో పరిస్థితి పూర్తిగా చేజారిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పశ్చిమ ఆసియాలో తలెత్తే ఏ చిన్న ఉద్రిక్తత అయినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా భారతదేశం వంటి దేశాలను తీవ్రంగా కుదిపేస్తుంది. ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంటే అంతర్జాతీయ మార్కెట్లో ముдиచమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకుతాయి. ఇది చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలపై తీవ్ర భారాన్ని మోపుతుంది. అలాగే హార్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకలపై దాడుల భయాలు పెరిగి.. ప్రపంచ రవాణా గొలుసు దెబ్బతింటుంది. ప్రపంచ వాణిజ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది.
ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో భారీ పతనాలు సంభవించి తీవ్ర అస్థిరత ఏర్పడుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లు రిస్క్ ఉన్న షేర్ల నుండి తమ నిధులను ఉపసంహరించుకుని, బంగారం వంటి సురక్షితమైన పెట్టుబడుల వైపు మళ్లుతారు. ప్రస్తుతానికి ట్రంప్ చేసిన ఈ ప్రకటన కేవలం రాజకీయ ఒత్తిడి వల్ల చేసిన హెచ్చరికా, లేక అమెరికా నిజంగానే ఒప్పందం నుండి పూర్తిగా వైదొలిగిందా అనేది స్పష్టం కానప్పటికీ.. రాబోయే రోజుల్లో ఈ దేశాలు తీసుకోబోయే తదుపరి చర్యలపైనే ప్రపంచ ఆర్థిక స్థిరత్వం ఆధారపడి ఉంది.


Click it and Unblock the Notifications
