ట్రంప్ కొత్త టారిఫ్ ప్రకటన.. ఫార్మా రంగానికి బిగ్ షాక్.. భారత ఫార్మా కంపెనీలపై ప్రభావం ఎలా ఉంటుందంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన సుంకాల విధానం ప్రపంచ ఫార్మా రంగాన్ని, ముఖ్యంగా భారతీయ జెనరిక్ మందుల పరిశ్రమను తీవ్ర ఆందోళనలోకి నెట్టివేసింది. జెనరిక్ ఉత్పత్తుల తయారీని తిరిగి అమెరికా భూభాగంలోనే చేపట్టేలా ప్రేరేపించడం.. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, స్థానిక ప్లాంట్లలో పెట్టుబడులు పెట్టని కంపెనీలను కఠినంగా నిరుత్సాహపరచడమే ఈ చర్య యొక్క ప్రధాన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ ప్రతిపాదిత దశలవారీ ప్రణాళిక వివరాలను వెల్లడించారు.
ఈ కొత్త సుంకాల విధానం ప్రకారంగా.. రాబోయే ఆగస్టు 1, 2026 నుండి తదుపరి రెండు సంవత్సరాల పాటు అంటే ఆగస్టు 2028 వరకు యునైటెడ్ స్టేట్స్‌లోకి దిగుమతి అయ్యే అన్ని జెనరిక్ మందులపై సున్నా శాతం సుంకం కొనసాగుతుంది. అయితే ఈ రెండేళ్ల వ్యవధి ముగిసిన వెంటనే.. అనగా ఆగస్టు 2028 నుండి మూడవ సంవత్సరంలో దిగుమతి చేసుకునే జెనరిక్ మందులపై ఏకంగా 100 శాతం సుంకం విధించబడుతుంది. ఆ తర్వాత సంవత్సరంలో ఈ పన్నును ఏకంగా 200 శాతానికి పెంచాలని ప్రణాళిక రూపొందించారు. నిర్ణీత కాలపరిమితిలోగా అమెరికాలోనే ఫ్యాక్టరీలు, ప్లాంట్లు, యంత్రాలను నిర్మించని కంపెనీలపై ఈ రకమైన పెనాల్టీ సుంకాలు అమలవుతాయి. అయితే పేటెంట్ పొందిన, బ్రాండెడ్, వినూత్నమైన ఔషధాల విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని.. అవి యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలకు అత్యంత సరసమైన ధరలకే నాణ్యమైన జెనరిక్ మందులను సరఫరా చేస్తున్నందున భారతదేశాన్ని ప్రపంచం 'వరల్డ్ ఫార్మసీ'గా అభివర్ణిస్తుంది. అమెరికా ఆరోగ్య రంగానికి కూడా భారత్ అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉంది. అమెరికాలో వినియోగించే మొత్తం జెనరిక్ మందుల పరిమాణంలో దాదాపు 40 శాతం వాటా భారతీయ కంపెనీలదే కావడం విశేషం. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదిక ప్రకారం.. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం చేసిన మొత్తం 25.8 బిలియన్ డాలర్ల ఫార్మా ఎగుమతులలో దాదాపు 38 శాతం.. అంటే 9.7 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఒక్క అమెరికాకే వెళ్లాయి. ఉన్నట్లుండి ఈ స్థాయి భారీ సుంకాలు అమల్లోకి వస్తే భారత ఫార్మా దిగ్గజాలపై తీవ్ర ఆర్థిక ప్రభావం పడుతుంది.
భారతీయ కంపెనీలు ఉత్పత్తి చేసే చౌకైన జెనరిక్ మందులు అమెరికాలోని సాధారణ ప్రజల ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి. అధిక రక్తపోటు, డిప్రెషన్, మధుమేహం, క్యాన్సర్, అంటువ్యాధులు, మానసిక రుగ్మతలకు సంబంధించిన అనేక మందులను అమెరికన్ వైద్యులు భారత్ నుండి వచ్చే జెనరిక్ రూపంలోనే విస్తృతంగా సూచిస్తున్నారు. ఉదాహరణకు, గర్భనిరోధకాల విషయంలో 2024 లో అమెరికాలో వైద్యులు రాసిచ్చిన మొత్తం మాత్రలలో సుమారు 65 శాతం కేవలం భారతదేశానికి చెందిన గ్లెన్‌మార్క్, లూపిన్ అనే రెండు కంపెనీల ద్వారానే సరఫరా చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో అధిక పన్నులు అమల్లోకి వస్తే భారతీయ కంపెనీల ఎగుమతులు దెబ్బతినడమే కాకుండా.. అమెరికాలోని సామాన్య రోగులపై కూడా మందుల ధరల భారం విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది.
ఈ హెచ్చరికల మధ్య భారత ఫార్మా రంగానికి చిన్నపాటి ఊరట ఏంటంటే.. భారత్ - అమెరికాలు ఫిబ్రవరిలో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ప్రకారం జెనరిక్ ఉత్పత్తులు, ముడి పదార్థాల సరఫరాపై చర్చల ద్వారా సాధించే మినహాయింపులు పొందే అవకాశం ఉండటం. అయితే ఆగస్టు 2028 లోపు భారతీయ ఫార్మా కంపెనీలు తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అమెరికాలోనే స్థానిక ప్లాంట్లను ఏర్పాటు చేయడం లేదా అక్కడి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి మార్గాలను అన్వేషించాల్సి రావచ్చు. రాబోయే రోజుల్లో ఈ సుంకాల ప్రతిపాదనలు ఏ రూపం దాలుస్తాయోనని గ్లోబల్ హెల్త్‌కేర్, ఫార్మా మార్కెట్లు ఆసక్తిగా గమనిస్తున్నాయి.


Click it and Unblock the Notifications
