Trump visa: లక్షల మంది క్యూలో ఉన్నారన్నారు.. తీరా చూస్తే ఒక్కరే! అట్టర్ ఫ్లాప్ అయిన ట్రంప్ ప్లాన్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్రవేశపెట్టిన 'గోల్డ్ కార్డ్' వీసా పథకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 8.5 కోట్లు) చెల్లిస్తే చాలు, అమెరికా పౌరసత్వం వైపు వేగంగా అడుగులు వేయొచ్చని ఈ పథకాన్ని ఎంతో ఆర్భాటంగా లాంచ్ చేశారు. అయితే, తాజా రిపోర్టుల ప్రకారం ఈ పథకం కింద ఇప్పటివరకు కేవలం ఒక్కరంటే ఒక్కరికి మాత్రమే వీసా అప్రూవల్ లభించింది. దీంతో ఈ 'గోల్డ్ కార్డ్' హైప్ అంతా ఉత్తుత్తిదేనా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

ఒక్క అప్రూవల్.. వందల మంది వెయిటింగ్
కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లూట్నిక్ ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. గత ఏడాది డిసెంబర్‌లో ఈ ప్రోగ్రామ్ మొదలైన కొద్ది రోజుల్లోనే 1.3 బిలియన్ డాలర్ల విలువైన కార్డ్స్ అమ్ముడయ్యాయని ప్రభుత్వం చెప్పిన మాటలకు, ప్రస్తుత లెక్కలకు అస్సలు సంబంధం లేదు. అయితే లూట్నిక్ మాత్రం చాలా ధీమాగా ఉన్నారు. "ప్రస్తుతం వందల మంది క్యూలో ఉన్నారు, మేము ప్రతి అప్లికేషన్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ఈ వ్యవస్థను పక్కాగా సెట్ చేయడానికే టైమ్ పడుతోంది" అని ఆయన చెప్పుకొచ్చారు.
అసలు ఈ గోల్డ్ కార్డ్ కథేంటి?
ట్రంప్ (Trump) దీనిని "గ్రీన్ కార్డ్ ఆన్ స్టెరాయిడ్స్" అని పిలుస్తారు. అంటే పాత EB-5 వీసా కంటే ఇది చాలా వేగంగా పనిచేస్తుంది.
- దీని ధర 1 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 8.5 కోట్లు).
- దీనితో పాటు 15 వేల డాలర్ల ఫీజు కూడా కట్టాలి.
- కంపెనీలు కూడా తమ విదేశీ ఉద్యోగుల కోసం 2 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఈ కార్డును కొనుగోలు చేయవచ్చు. ఈ కార్డు ద్వారా వచ్చే ఆదాయంతో అమెరికా అప్పులను తగ్గించవచ్చని, బడ్జెట్ లోటును భర్తీ చేయవచ్చని ట్రంప్ భావిస్తున్నారు. ఏకంగా 1 ట్రిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని వారు అంచనా వేస్తున్నారు.
ప్లాటినం కార్డ్ కూడా వస్తోంది!
ప్రభుత్వం దీని కోసం ఒక గ్లామరస్ వెబ్‌సైట్‌ను కూడా నడుపుతోంది. అందులో ట్రంప్ (Trump) ఫోటోతో పాటు 'అన్‌లాక్ లైఫ్ ఇన్ అమెరికా' అని రాసి ఉంటుంది. త్వరలో 'ట్రంప్ ప్లాటినం కార్డ్' కూడా రాబోతోంది. దీని ధర 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 42 కోట్లు). ఈ కార్డ్ ఉంటే అమెరికాలో 270 రోజుల పాటు ఉండొచ్చు , అమెరికా వెలుపల వచ్చే ఆదాయంపై ఎలాంటి పన్నులు కట్టక్కర్లేదట.
సమస్య ఎక్కడ ఉంది?
చట్టపరమైన H-1B వీసా అప్రూవల్స్ 25 శాతం పడిపోయిన తరుణంలో, ఇలా డబ్బులు పెట్టి వీసాలు కొనే పథకం రావడంపై విమర్శలు వస్తున్నాయి. కేవలం ధనవంతులకు మాత్రమే అమెరికా తలుపులు తీస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, అమెరికా పౌరసత్వం కోసం ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించే వారు ఎంతమంది ఉంటారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ట్రంప్ (Trump) ఆశించినట్లు ఈ పథకం ట్రిలియన్ డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications