Flight Offers: దీపావళి చాలా పెద్ద పండుగ. దీంతో అనేక మంది ప్రజలు సొంత ఊళ్లకు, ఇతర రాష్ట్రాలు, నగరాల్లోని తమ బంధువుల ఇళ్లకు వెళుతుంటారు. దీంతో బస్సులు, రైళ్లు, విమానాల్లో టిక్కెట్లు దొరకటం ఖరీదైనదిగా మారుతోంది. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకోవటానికి ప్రయత్నిస్తున్న వారికి ఛార్జీల షాక్ కొడుతోంది.

పీక్ డిమాండ్..
సందట్లో సడేమియా లాగా.. పండుగల సీజన్ డిమాండ్ ను పైసలు చేసుకునే పనిలో పడ్డాయి రవాణా సంస్థలు. ఈ క్రమంలో విదేశీ విమాన ఛార్జీలతో పోలిస్తే.. దేశంలో ప్రయాణించటానికి విమాన ఛార్జీలు దారుణంగా పెరిగిపోయాయి. వీటిని చూస్తున్న విశ్లేషకులు ఊళ్లకు వెళ్లటం కంటే.. దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్ వంటి నగరాలకు ప్రయాణించటానికే తక్కువ ఖర్చు అవుతుందని అంటున్నారు.

పాట్నా ప్రయాణం..
ఈ ఏడాది ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నుంచి పాట్నా గతంలో కంటే 3 రెట్లు ఎక్కువ టిక్కెట్లు బుక్ అయ్యాయి. అక్టోబర్ 22న ఢిల్లీ నుంచి పాట్నా ప్రయాణానికి అతి తక్కువ ధర రూ.17,000 కాగా, ముంబై నుంచి పాట్నాకు ఛార్జీ ఏకంగా రూ.20,000గా ఉంది. ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు డిమాండ్ కు ఏమాత్రం సరిపోవటం లేదని ఈ రేట్లే చెబుతున్నాయి.

విదేశాలకు ఛార్జీలు..
అక్టోబర్ 22న ఢిల్లీ నుంచి షార్జాకు రూ.11,000, ఢిల్లీ నుంచి బ్యాంకాక్‌కి రూ.10,500, ఢిల్లీ నుంచి సింగపూర్‌కు రూ.13,000 టిక్కెట్ ధర ఉంది. వీటి ప్రకారం స్వదేశంలో ప్రయాణించటం కంటే అంతర్జాతీయ ప్రయాణాలు చేయటం చాలా తక్కువ ఖరీదుగా మారిపోయింది.

విమానయాన సంస్థలు..
తత్కాల్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి విపరీతమైన పోటీ నెలకొనడంతో విమానయాన సంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. ప్రైవేట్ బస్ కంపెనీల మాదిరిగానే విమానయాన సంస్థలు కూడా ధరలను పెంచాయి. ఇది ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అనేక మంది టిక్కెట్లకు భారీగా వెచ్చించాల్సి రావటంపై పెదవి విరుస్తున్నారు.


Click it and Unblock the Notifications