IPO News: చౌక ఐపీవో గ్రాండ్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకింది.. ఇన్వెస్టర్ల సందడి..
IPO News: కొత్త వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో మళ్లీ ఐపీవోల కోలాహలం మెుదలైంది. నేడు మెుత్తం రెండు కంపెనీల ఐపీవోలు లిస్ట్ చేయబడ్డాయి.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది మార్కెట్లో బలమైన లిస్టింగ్ నమోదు చేసిన ట్రాన్స్‌స్టీల్ సిట్టింగ్ టెక్నాలజీస్ ఐపీవో గురించే. కంపెనీ NSE SME కేటగిరీలో 27 శాతం ప్రీమియంతో ఒక్కో షేరు రూ.88.90 ధర వద్ద లిస్ట్ చేయబడింది. ఐపీవో గ్రాండ్ ఎంట్రీ నమోదు చేసిన కొద్ది సేపటికే 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో కంపెనీ షేర్ ధర అమాంతం రూ.93.30కి పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లు తొలిరోజే షేర్ల నుంచి మంచి లాభాలను అందుకున్నారు.

వాస్తవానికి ట్రాన్స్‌స్టీల్ సిట్టింగ్ టెక్నాలజీస్ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధర ఒక్కో షేరుకు రూ.67 నుంచి రూ.70గా నిర్ణయించింది. దేశంలోని రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవోను అక్టోబర్ 30న ప్రారంభించి నవంబర్ 1, 2023న ముగించింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.49.98 కోట్లను సమీకరించింది. ఇందుకోసం 67.84 లక్షల షేర్లను విక్రయించింది. ఇన్వెస్టర్లు ఐపీవోలో పాల్గొనేందుకు కనీసం లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా కంపెనీ ప్రకటించింది. ఈ లెక్కన ఐపీవోలో పాల్గొనాలనుకున్న పెట్టుబడిదారులు రూ.1,40,000 కనీస మెుత్తాన్ని పెట్టుబడిగా పెట్టారు.
చివరి రోజున ట్రాన్స్‌స్టీల్ సిట్టింగ్ టెక్నాలజీస్ ఐపీవో 49 రెట్ల కంటే ఎక్కువ సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. ఈ IPO రిటైల్ కేటగిరీలో 39.82 సార్లు సబ్‌స్క్రైబ్ పొందగా.. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ కొనుగోలుదారుల విభాగంలో 12.15 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగంలో 122.88 రెట్లు సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. మెుత్తానికి ఐపీవో తొలిరోజునే తన అద్భుతమైన పనితీరుతో ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చేసింది.


Click it and Unblock the Notifications