Telecom News: రోజూ పదుల సంఖ్యలో వస్తున్న స్పామ్ కాల్స్ చూసి విసుగురాక మానదు. వీటిని అరికట్టేందుకు టెలికాం నియంత్రణ సంస్థ కూడా రంగంలోకి దిగింది. ఫోన్ చేసే వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు వీలుగా ఓ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
మొబైల్స్ ద్వారా వచ్చే ఇబ్బందికరమైన మరియు మోసపూరిత స్పామ్ కాల్స్ పరిష్కారానికి టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. కాల్ వచ్చేటప్పుడు కాలర్ల పేర్లను ప్రదర్శించాలని గతంలోనే ప్రతిపాదించింది. కాగా ఇప్పుడు దాన్ని అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది. ఇందుకు వీలుగా కాలర్ వివరాలను అందించేందుకు కస్టమర్ అప్లికేషన్ ఫారమ్ (CAF)ను ప్రామాణికంగా తీసుకోనుంది.

కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) అనే సప్లిమెంటరీ సర్వీస్‌ను భారతీయ టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లో ప్రవేశపెట్టాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) సిఫార్సు చేసింది. ఎవరైనా కాల్ చేసినప్పుడు ఫోన్ స్క్రీన్‌లపై కాలర్ పేరు ఫ్లాష్ అయ్యేలా చేసేందుకు ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది.
కస్టమర్ అప్లికేషన్ ఫారమ్ (CAF)లో సబ్‌స్క్రైబర్ అందించిన పేరు మరియు గుర్తింపు సమాచారాన్ని ఈ ప్రయోజనం కోసం ఉపయోగించాలని నియంత్రణ సంస్థ భావిస్తోంది. ట్రూకాలర్, భారత్ కాలర్ ఐడీ, యాంటీ స్పామ్ వంటి థర్డ్-పార్టీ యాప్‌లు కూడా ఈ తరహా కాలింగ్ పార్టీ పేరు గుర్తింపు సేవలను అందిస్తున్ననాయి. ఇవి క్రౌడ్-సోర్స్ డేటా ఆధారంగా ఉంటాయి కాబట్టి అంత నమ్మదగినవి కావు.
ఇప్పటికే CNAP సేవపై వాటాదారులు, ప్రజలు మరియు ఇండస్ట్రీ ప్లేయర్స్ వ్యాఖ్యలను కోరుతూ ట్రాయ్ ఒక సంప్రదింపు పత్రాన్ని విడుదల చేసింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఇన్‌పుట్‌ల ఆధారంగా దాని స్వంత విశ్లేషణతో.. భారత టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లో కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) సర్వీస్ పరిచయంపై తన సిఫార్సులను ఖరారు చేసింది.
రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా వంటి ప్రముఖ సంస్థలు.. కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) అమలును తప్పనిసరి చేయకూడదని, ఐచ్ఛికంగా ఉంచాలని గతంలో వాదించారు. 2023 ప్రారంభంలో టెలికాం ఇండస్ట్రీ బాడీ సాంకేతిక, గోప్యత మరియు వ్యయ సంబంధిత ఆందోళనలను ఫ్లాగ్ చేసింది. కమ్యూనికేషన్ సురక్షితంగా మరియు సమర్ధవంతంగా నిర్వహించేందుకు ట్రూకాలర్ కూడా ఈ ప్రయత్నాలను స్వాగతించింది.


Click it and Unblock the Notifications