రూ. 1.06 లక్షల కోట్ల నిధి.. టెలికాం కంపెనీలు, టెక్ దిగ్గజాల మధ్య మొదలైన అసలైన యుద్ధం!
భారతదేశంలో డిజిటల్ విప్లవాన్ని గ్రామగ్రామానికి తీసుకెళ్లడం కోసం ప్రభుత్వం దగ్గర ఏకంగా రూ. 1.06 లక్షల కోట్ల భారీ నిధి ఉంది. దీని పేరే 'డిజిటల్ భారత్ నిధి' (గతంలో దీన్ని USOF అనేవారు). అయితే, ఇప్పుడు ఈ భారీ ఫండ్‌ను దేనికి ఖర్చు చేయాలనే విషయంపై దేశంలోని పెద్ద పెద్ద టెలికాం ఆపరేటర్లు (జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా) ఒకవైపు.. గ్లోబల్ టెక్ దిగ్గజాలు (గూగుల్, మెటా, అమెజాన్), శాటిలైట్ కంపెనీలు మరోవైపు చేరి పెద్ద యుద్ధమే స్టార్ట్ చేశాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (Trai) నిర్వహిస్తున్న ఒక చర్చలో ఈ వివాదం బయటపడింది.

అసలు సమస్య ఎక్కడ వచ్చింది?
భారత ప్రభుత్వం 2020లో దేశవ్యాప్తంగా ఉచిత లేదా తక్కువ ఖర్చుతో కూడిన పబ్లిక్ WiFi ని అందించడానికి 'PM-WANI' అనే ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. 2022 నాటికి 1 కోటి, అలాగే 2030 నాటికి 5 కోట్ల వైఫై హాట్‌స్పాట్లను ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకుంది. కానీ, ఏప్రిల్ 2026 నాటికి కేవలం 4.1 లక్షల హాట్‌స్పాట్లు మాత్రమే వచ్చాయి. అంటే అనుకున్న టార్గెట్‌లో ఇది చాలా చాలా తక్కువ. దీంతో ఈ స్కీమ్‌ను మళ్లీ ఎలా బతికించాలి? ఈ లక్ష కోట్ల ఫండ్‌ను వైఫై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం వాడాలా? అని ట్రాయ్ (Trai) అభిప్రాయాలను కోరింది. ఇక్కడే అసలైన గొడవ మొదలైంది.
టెలికాం కంపెనీల వాదన: "పబ్లిక్ వైఫై అవసరమే లేదు!"
Reliance Jio, Airtel, Vi కంపెనీల తరపున సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) గట్టిగా వాయిస్ వినిపించింది. వారి వాదన ఏంటంటే..
- ఈ లక్ష కోట్ల నిధిలో అత్యధిక భాగం (తమ ఆదాయంలో 5% చొప్పున) టెలికాం కంపెనీలే కడుతున్నాయి. కాబట్టి తమ డబ్బుతో తమకు పోటీగా వచ్చే వైఫై నెట్‌వర్క్‌లకు సబ్సిడీలు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి.
- ఇండియాలో ఇప్పటికే 4G, 5G నెట్‌వర్క్‌లు విపరీతంగా పెరిగాయి. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరలకే మొబైల్ డేటా దొరుకుతోంది. అలాంటప్పుడు ఇక పబ్లిక్ వైఫైతో పనేంటి?
- స్మార్ట్‌ఫోన్ ఉన్నవాళ్లకు ఆల్రెడీ డేటా ప్యాక్ ఉంటుంది, లేనివాళ్లు వైఫై ఎలా వాడుకుంటారు? కాబట్టి ఈ ఫండ్‌ను వెనుకబడిన ప్రాంతాలలో మొబైల్ టవర్లు వేయడానికి మాత్రమే వాడాలని జియో వాదిస్తోంది.
టెక్ కంపెనీల కౌంటర్: "మొబైల్ డేటా మాత్రమే సరిపోదు!
గూగుల్, మెటా, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలు ఉన్న బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ (BIF) టెల్కోల వాదనను పూర్తిగా తప్పుపట్టింది. ఇంటర్నెట్ అంటే కేవలం మొబైల్ మాత్రమే కాదని గుర్తు చేసింది.
- దేశంలో 70% నుండి 80% ఇంటర్నెట్ వినియోగం ఇళ్ల లోపల (Indoors) జరుగుతుంది. అక్కడ మొబైల్ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు.
- ఫైబర్ లైన్లతో వచ్చే వైఫై ద్వారా మొబైల్ డేటా కంటే చాలా తక్కువ ఖర్చుతో హై-స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వచ్చు.
- అందుకే ఈ డిజిటల్ భారత్ నిధిని గ్రామ పంచాయతీల్లో, వెనుకబడిన ఏరియాల్లో వైఫై హాట్‌స్పాట్లు పెట్టడానికి కేటాయించాలని కోరుతోంది.
మరోవైపు అమెజాన్‌కు చెందిన ప్రాజెక్ట్ కైపర్ (Project Kuiper) కూడా రంగంలోకి దిగింది. ఫైబర్ కేబుల్స్ వేయడం కష్టమైన అడవులు, కొండ ప్రాంతాల్లో శాటిలైట్ (ఉపగ్రహం) ద్వారా వైఫై కనెక్టివిటీ ఇచ్చేందుకు ఈ ఫండ్‌ను అనుమతించాలని కోరింది.
తప్పు మోడల్‌ది కాదు.. అమలు చేయడంలోనే!
PM-WANI స్కీమ్ రూపకర్త, ట్రాయ్ మాజీ చైర్మన్ ఆర్.ఎస్. శర్మ మాత్రం ఈ విధానాన్ని సమర్థించారు. పబ్లిక్ వైఫై ప్లాన్ సూపర్ అని, కానీ దాన్ని అమలు చేయడంలో టెలికాం కంపెనీల సహాయ నిరాకరణ, పాలసీ ఆలస్యం, హార్డ్‌వేర్ కొరత వల్లే నెమ్మదించిందని చెప్పారు. దీనికోసం యూపీఐ (UPI) ని కంట్రోల్ చేసే NPCI లాంటి ఒక ప్రత్యేక నేషనల్ బాడీని ఏర్పాటు చేస్తే పనులు స్పీడందుకుంటాయని ఆయన సలహా ఇచ్చారు. మరి ఈ లక్ష కోట్ల ఫండ్ చివరికి ఎవరి జేబుల్లోకి వెళ్తుందో, సామాన్యుడికి ఉచిత వైఫై దక్కుతుందో లేదో చూడాలి!


Click it and Unblock the Notifications