Onion Price: భారీగా పెరిగిన ఉల్లి ధర.. కిలో రూ.100..!
ఉల్లి ధరలు పరుగెడుతున్నాయి. వారం క్రితం వరకు కిలో రూ.50 పలికిన ఉల్లి ధర ఇప్పుడు కిలో రూ.70 నుంచి రూ.80 లకు చేరింది. రెండు నెలల క్రితం కేజీ ధర కేవలం రూ.20 ఉండగా.. నెల రోజుల్లోనే మూడింతలు పెరిగింది. ప్రస్తుతం రిటేల్ మార్కెట్‌లో ఉల్లి ధర రూ.80 పలుకుతోంది. మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్ ధర రూ.5200- 5500 దాకా పలుకుతుందని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి మాత్రమే ఉల్లి విక్రయానికి వస్తోందని.. రోజుకు 5200-6000 క్వింటాళ్లు అమ్మకం జరుగుతోందని పేర్కొంటున్నారు. మార్కెట్‌కు ఉల్లి తక్కువగా రావడంతో ధర క్రమంగా పెరుగుతోందని చెబుతున్నారు.
డిమాండ్ తగ్గ సరఫరా లేకపోవడమే ఉల్లి ధర పెరగడానికి కారణంగా చెబుతున్నారు. వారం పది రోజుల్లో రూ.100కు చేరువగా వెళ్లొచ్చని కమీషన్ ఏజెంట్లు అంచనా వేస్తున్నారు. ఉల్లి ధరలు భారీగా పెరగడం వల్ల సాధారణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి వాడకాన్ని తగ్గిస్తున్నారు. ఇక పానీ పూరీ, మిర్చీ బజ్జీ బండ్ల వద్ద ఉల్లి వినియోగాన్ని తగ్గించేశారు. ఉల్లి ధరలు అదుపులోకి తేవడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే బఫర్ స్టాక్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తోంది. ఏపీ ప్రభుత్వం కూడా ఉల్లి ధరలు నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డిల్లీకి వెళ్లిమరీ కేంద్ర ప్రభుత్వంతో ఉల్లి ధరలపై చర్చలు జరిపారు.

ఈ క్రమంలోనే ఏపీకి భారీగా ఉల్లిపాయలను సరఫరా చేసేందుకు కేంద్రం ఒప్పుకుంది. వీటిని రాయితీ ధరలో ప్రజలకు అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం రూ.32 లకే కేజీ ఉల్లి అందించాలని నిర్ణయించింది. నగరాల్లోని రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలు విక్రయించనుంది. కాగా ఉల్లి ధరలు తగ్గాలంటే 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఉల్లి వ్యాపారులు చెబుతున్నారు. కొత్త పంట చేతికి వస్తే ధరలు తగ్గే అవకాశం ఉందని వివరిస్తున్నారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి పొరుగు రాష్ట్రాల్లో ఉల్లిగడ్డ దిగుబడి బాగా తగ్గిందని వ్యాపారులు తెలిపారు. వాస్తవంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి మహారాష్ట్రలోని నాసిక్, కర్ణాటక ఎక్కువ సంఖ్యలో వస్తుంటుంది. అలాగే తెలంగాణలోని మహబూబ్‌నగర్, ఏపీలోని కర్నూల్ నుంచి ఉల్లి వస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి మాత్రమే ఉల్లి వస్తున్నట్లు వివరిస్తున్నారు. అటు వెల్లుల్లి, అల్లం ధరలు కూడా భారీగా పెరిగాయి. ఎల్లిగడ్డను కిలోకు రూ.205, అల్లం కిలో రూ.120కి చేరింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
