న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దెబ్బతిన్న వివిధ రంగాలకు 8 ఆర్థిక ఉపశమన చర్యలు ప్రకటిస్తున్నామని, ఇందులో నాలుగు కొత్తవి అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం నేడు (జూన్ 28, సోమవారం) ఆర్థిక ప్యాకేజీతో ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా నిర్మలమ్మ ప్రకటన చేశారు. కరోనాతో దెబ్బతిన్న రంగాలకు రూ.1.1 లక్షల కోట్ల లోన్ గ్యారెంటీ స్కీంను ప్రకటించారు. ఆత్మనిర్భరం భారత్ ప్రోగ్రాంలో భాగంగా ఎమర్జెన్సీ క్రెడిట్ గ్యారెంటీ స్కీంను మరో రూ.1.5 లక్షల కోట్లను అదనంగా ప్రకటించారు.
లోన్ గ్యారెంటీ స్కీంలో హెల్త్ రంగానికి రూ.50,000 కోట్లు, ఇతర రంగాలకు అదనంగా రూ.60,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రంగాలవారీగా కేటాయింపులను ప్రకటిస్తామన్నారు. తాజాగా ప్రకటించిన కొత్త క్రెడిట్ గ్యారెంటీ స్కీం MFIల ద్వారా 25 లక్షల మంది వ్యాపారులకు రుణ సౌకర్యం కల్పిస్తుందని నిర్మలమ్మ తెలిపారు.

ఇండివిడ్యువల్స్‌కు రుణ పరిమితి రూ.1.25 లక్షలు, మూడేళ్ల కాలపరిమితితో ఉంటుందని చెప్పారు. పాత రుణాలతో సంబంధం లేకుండా కొత్త రుణాలు ఇస్తామన్నారు. వ్యాపార పునరుద్ధరణకు ఈ రుణాలు ఉపయోగపడతాయన్నారు. ఎంసీఎల్ఆర్‌తో పోలిస్తే వడ్డీ రేటు కనీసం 2 శాతం తక్కువగా ఉంటుందన్నారు. గరిష్టంగా రూ.100 కోట్ల వరకు మూడేళ్లకు హామీ ఉంటుందన్నారు. వడ్డీ రేటు 7.95 శాతంగా ఉంటుందని చెప్పారు. వైద్య, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు,
11,000కు పైగా రిజిస్టర్డ్ టూరిస్ట్ గైడ్స్/ట్రావెల్ అండ్ టూరిజం స్టేక్ హోల్డర్స్‌కు లోన్ గ్యారెంటీ స్కీం ద్వారా ఆర్థిక మద్దతు ఇస్తామని నిర్మలమ్మ తెలిపారు. టూరిజం రంగానికి ఊతమిచ్చే లక్ష్యంలో భాగంగా మొదటి 5 లక్షల మంది టూరిస్ట్‌లకు ఉచితంగా వీసా సౌకర్యం కల్పిస్తామన్నారు. మొత్తం రూ.100 కోట్ల ప్యాకేజీ ఉంటుందన్నారు. ఆత్మనిర్భర్ రోజ్‌గార్ యోజనను 31 మార్చి 2021 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications