HCLTech: బెంగళూరులో ఆఫీస్ అమ్మేసిన హెచ్‌సీఎల్ .. విప్రో దారిలోనే టెక్ దిగ్గజం..
HCLTech News: దేశంలోని టెక్ కంపెనీలు ప్రస్తుతం అధిక ఖర్చుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రాజెక్టుల రాక మందగించటంతో అధిక వేతనాలున్న ఉద్యోగులను అప్రెన్టీస్‌లను నియమించుకుంటున్నట్లు నివేదికలు బయటపడ్డాయి.
ఇలాంటి వ్యాపార వాతావరణంలో దేశంలోని 3వ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ HCL టెక్నాలజీస్ లిమిటెడ్ బెంగళూరులోని తన కార్యాలయ ఆస్తులను విక్రయించాలని యోచిస్తోంది. దీనికి ముందు టాప్ టెక్ కంపెనీ అయిన విప్రో సైతం తన హైదరాబాదు, బెంగళూరు ఆస్తులను విక్రయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అనవసరపు ఖర్చుల మదింపులో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు వస్తున్నాయని తెలుస్తోంది. రోషిణి నాడార్ నేతృత్వంలోని హెచ్‌సిఎల్ టెక్ వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా కొన్ని కొత్త రంగాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంది.

కర్ణాటకలో సెమీకండక్టర్ చిప్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని హెచ్‌సీఎల్ గ్రూప్ నిర్ణయించింది. ఇందుకోసం రోషిణి నాడార్ దాదాపు 400 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు సమాచారం. దీనికోసం బెంగళూరు విమానాశ్రయ సమీపంలో, మైసూరూలో భూ కేటాయింపు జరిగినట్లు తెలుస్తోంది. వ్యూహాత్మక పునర్నిర్మాణంలో భాగంగా నాన్-కోర్ రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించడం ద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో హెచ్‌సీఎల్ టెక్ బెంగళూరులోని ప్రధాన వ్యాపార ప్రాంతాల్లో ఒకటైన జిగాని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉన్న తన స్పెషల్ ఎకనామిక్ జోన్ కాంప్లెక్స్‌ను విక్రయించాలని నిర్ణయించుకుంది.దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ ఉంది. ఈ విక్రయం ద్వారా దాదాపు రూ.550 కోట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఏడాది HCL హార్డ్‌వేర్ వ్యాపారం నుండి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. కంపెనీ గత ఏడాది చెన్నైలో 6.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అదనంగా HCL టెక్ తన ఉద్యోగులలో 70-75% మందిని ప్రస్తుత సంవత్సరం చివరి నాటికి తిరిగి కార్యాలయానికి పిలవాలని యోచిస్తోంది.


Click it and Unblock the Notifications