Tech News: భారతీయ ఐటీ కంపెనీలకు అసలైన పరీక్షా కాలం మెుదలైంది. కరోనా తర్వాత బూమ్ నుంచి సంక్షోభంలోకి జారిన కంపెనీ హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకునే సమయానికి అమెరికాలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వ్యాపారంలో పోటీతో పాటు టాలెంట్ హంటింగ్ కోసం కంపెనీలు భారీ ప్యాకేజీలకు టెక్కీలను నియమించుకోవటం కూడా కొంత భారాన్ని పెంచింది. ఈ క్రమంలో కొత్త డీల్స్ సంఖ్య కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటం కొత్త పరీక్షా కాలాన్ని తెచ్చింది.
ఇలాంటి సందర్భంలో భారతదేశంలోని ప్రముఖ ఐటీ సేవల కంపెనీలైన TCS, Wipro, Infosys, HCLలతో పాటు అధిక స్థాయిలో భారతీయ సిబ్బందిని కలిగి ఉన్న విదేశీ టెక్ సంస్థలైన ఐబీఎం, యాక్సెంచర్, క్యాప్ జెమినీ తమ గత ప్రాజెక్టుల గడువు ముగింపుకు వస్తున్న వేళ వాటిని తిరిగి రెన్యూవల్ చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ కంపెనీలు సర్వీస్ కాంట్రాక్ట్‌ను ఇప్పటికే ఉన్న కంపెనీకి కేటాయించవచ్చు లేదా మరో కంపెనీకి బిడ్డింగ్ ప్రక్రియలో బదిలీ చేసే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సందర్భంలో భారతీయ కంపెనీలు తమ మార్జిన్లను త్యాగం చేసి ప్రాజెక్టులను హోల్డ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. అందువల్ల జనవరి 2025 నుంచి మార్చి 2026 వరకు భారతీయ టెక్ కంపెనీలు పెద్ద పరీక్షా కాలాన్ని క్రాస్ చేయాల్సి ఉంటుంది.

మరో పక్క చాలా విదేశీ కంపెనీలు భారతదేశంలో తమ జీసీసీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. పైగా టాలెంట్ పూల్ ఆకర్షించేందుకు భారీ మెుత్తంలో ప్యాకేజీలను సైతం ఆఫర్ చేస్తున్నాయి. ఇలా ఇండియాలోనే సొంతంగా కేంద్రాలను ఏర్పాటు చేసే సదరు టెక్ కంపెనీలు మొత్తం ప్రాజెక్ట్‌ను భారతీయ ఐటి సేవా సంస్థల నుంచి వెనక్కి తీసుకొని సొంతంగా తమ ఉద్యోగులతో వాటిని ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇది టెక్ కంపెనీలకు అతిపెద్ద కష్టమైన పరిస్థితిగా చెప్పుకోవచ్చు.
రూపాయి క్షీణత కారణంగా డాలర్ విలువ పెరగడం వల్ల భారతీయ ఐటీ సేవల సంస్థలకు ఎక్కువ ఆదాయం వస్తున్న మాట వాస్తవమే అయినా.. రెన్యూవల్ కాకపోవడంతో టెక్ కంపెనీలు పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఒక కంపెనీ పెద్ద కాంట్రాక్టును పునరుద్ధరించలేక, వ్యాపారాన్ని కోల్పోతే, అది నేరుగా కంపెనీ రాబడి, లాభాల కొలమానాలను ప్రభావితం చేస్తుంది. దీనికి ప్రతిస్పందనగా, నిర్వహణ వేరియబుల్ పే, జీతం ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లను తగ్గిస్తుంది. ఇలాగే పరిస్థితి చేయి దాటితే ఉద్యోగులను తొలగించేందుకు ఐటీ కంపెనీలు వెనుకాడటం లేదు. ఈ పరిస్థితులపై మార్కెట్లోని ఇన్వెస్టర్లతో పాటుగా ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రాజెక్టులు లేకపోతే ఇప్పటికే బెంచ్ పై ఉన్న ఉద్యోగుల పరిస్థితి మరింతగా దిగాజారుతుందని చాలా మంది దేశీయ టెక్కీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం ఈక్విటీ మార్కెట్లలో టెక్ కంపెనీల షేర్లపై కూడా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు వారిస్తున్నారు.


Click it and Unblock the Notifications