IT Shares: అంతర్జాతీయంగా ఐటీ సేవల పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత కంపెనీలు తొలి త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను అందుకోవటంలో వెనకబడ్డాయి. అయితే ఇన్వెస్టర్లు మాత్రం తమ బెట్టింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, ఇన్ఫోసిస్ లిమిటెడ్, HCL టెక్నాలజీస్ లిమిటెడ్, Wipro, LTIMindtree లిమిటెడ్ స్టాక్ అద్భుతాలు సృష్టించాయి. ఆరు అగ్ర ఐటీ కంపెనీలు రెండు ట్రేడింగ్ సెషన్లలో ఏకంగా ఇన్వెస్టర్ల సంపదను 1.74 లక్షల కోట్ల మేర పెంచాయి. ఇదే కాలంలో ఐటీ ఇండెక్స్ మొత్తం రూ.1.8 లక్షల కోట్ల విలువను జోడించింది. బుధవారం మార్కెట్ క్లోజింగ్ తర్వాత టీసీఎస్ ఫలితాలను విడుదల చేయటంతో రిజల్ట్స్ సీజన్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఐటీ స్టాక్స్ ర్యాలీని కొనసాగిస్తున్నాయి.

జూన్ త్రైమాసికంలో IT సంస్థలు బలమైన డీల్స్ చేసినట్లు వెల్లడించాయి. US ఫెడ్ రేట్ల పెంపు చక్రం ముగింపు దశకు చేరుకుందని ఆర్థిక డేటా సూచించిన నేపథ్యంలో గ్లోబల్ టెక్నాలజీ స్టాక్‌లలో బుల్లిష్ రన్ ఊపందుకుంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు టీసీఎస్ 5.13 శాతం పెరిగి రూ.3,512 స్థాయికి చేరుకుంది. రెండు రోజుల వ్యవధిలో టీసీఎస్ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.92,135 కోట్లు పెరిగింది. శుక్రవారం నాడు ఇన్ఫోసిస్ 4.4 శాతం పెరిగి రూ.1,425.35కి చేరగా.. రెండు రోజుల వ్యవధిలో కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ.38,181 కోట్ల మేర పెరిగింది.
ఇక హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ల విషయానికి వస్తే 3.80 శాతం పెరిగి రూ.1,151.30కి చేరుకుంది. ఎర్నింగ్స్ మిస్‌తో మునుపటి సెషన్‌లో పడిపోయింది. అయినప్పటికీ రెండు రోజుల వ్యవధిలో స్టాక్ తన m-క్యాప్‌కు రూ.11,194 కోట్లు జోడించింది. ఇదే క్రమంలో ఐటీ దిగ్గజం విప్రో రెండు ట్రేడింగ్ సెషన్లలో ఏకంగా రూ.17,888 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకోగా.. చివరగా LTIMindtree రూ.8,292 కోట్లు, టెక్ మహీంద్రా రూ.6,687 కోట్ల మేర తమ మార్కెట్ విలువను పెంచుకున్నాయి. దీంతో ఈ టెక్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది.


Click it and Unblock the Notifications