Economy: దేశాభివృద్ధిలో టాప్ 5 సౌత్ ఇండియన్ స్టేట్స్.. తెలుగు రాష్ట్రాల స్థానమేంటంటే..
Economy: ప్రతి రాష్ట్రమూ తలో చెయ్యి వేస్తేనే దేశ ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే దక్షిణ భారత రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, కేరళ మరియు తెలంగాణలు ఇందులో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఇండియా GDPలో ఈ ఐదు రాష్ట్రాల వాటా 30 శాతానికి పైగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటా మరియు ఆయా రాష్ట్రాల ఆర్థిక సర్వేలు ఈ విషయాన్ని క్షుణ్ణంగా చెబుతున్నాయి.
FY23కి గాను 24.8 లక్షల కోట్ల GSDPతో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తమిళనాడు సత్తా చాటుతోంది. 22.4 లక్షల కోట్లతో కర్ణాటక రెండవ స్థానంలో, 13.3 మరియు 13.2 లక్షల కోట్లతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తదనంతర స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక 10 లక్షల కోట్ల GSDPతో కేరళ ఐదవ స్థానానికి పరిమితమైంది. తలసరి ఆదాయం, రాష్ట్ర రుణం, పన్ను రాబడి, వడ్డీ చెల్లింపు నిష్పత్తి మరియు ద్రవ్య లోటు వంటి విభాగాల్లో ప్రగతి ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది.

ఈ ఐదు రాష్ట్రాల్లో చూస్తే FY22లో తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయం సాధించగా ఆంధ్రప్రదేశ్ లో అత్యల్పం నమోదైంది. వీటి GDP తక్కువగా ఉన్నా జాతీయ సగటు కంటే ఎక్కువే ఉండటం గమనార్హం. 25.3 శాతం GDP-రుణ నిష్పత్తిలోనూ తెలంగాణ బలమైన ఆర్థిక స్థితిని కనబరుస్తోంది. 32.8 శాతంతో AP నాలుగో స్థానానికి పరిమితమైంది. ఇక పన్ను ద్వారా రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో తమిళనాడు అగ్రస్థానం కైవసం చేసుకుంది. తెలంగాణ, ఆంధ్రలు వరుసగా మూడు, నాలుగుతో సరిపెట్టుకున్నాయి.
రుణ అవసరాన్ని సూచించే స్థూల ద్రవ్య లోటు కర్ణాటకలో తక్కువగా ఉంది. అంటే అక్కడ ఆర్థిక క్రమశిక్షణ ఎక్కువ అన్నమాట. ఈ విభాగంలో తర్వాత స్థానం ఆంధ్రప్రదేశ్ ఆక్రమించగా.. తెలంగాణ నాల్గవదిగా నిలిచింది. రుణాలకు అత్యధిక వడ్డీలు చెల్లిస్తూ తెలంగాణ అగ్రస్థానం పొందగా.. కర్ణాటక, APలు 3 శాతం తేడాతో తదనంతర స్థానంలో కొనసాగుతున్నాయి. మొత్తం మీద దక్షిణ భారత రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటకలు పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నట్లు అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications