IT News: ఒకే వ్యూహం అమలులో టాప్-10 ఐటీ కంపెనీలు.. అయోమయంలో టెక్కీలు..
IT News: గత వారం రోజులుగా దేశంలోని టాప్ టెక్ దిగ్గజ కంపెనీలు తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. అవి కంపెనీల వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ప్రధానంగా కంపెనీలు భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మెుదటి త్రైమాసిక ఫలితాల్లో అన్ని కంపెనీల్లో కామన్‌గా కనిపించిన కనిపించిన అంశాలు ఉద్యోగుల నియామకాలు, ఖర్చుల మదింపు, తగ్గిన ఆదాయపు అంచనాలు, ఏఐపై పెరుగుతున్న కంపెనీల ఫోకస్. అయితే ఇప్పుడు ఎక్కువ మంది టెక్కీలను ఆందోళనకు గురిచేస్తున్న అంశం మాత్రం ఆగిపోయిన నియామకాలు, పెరుగుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం.

ఈ క్రమంలో టాప్-10 భారతీయ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే తక్కువగా నమోదు చేశాయి. తొలి త్రైమాసికంలో ఈ కంపెనీల్లో మెుత్తం ఉద్యోగుల సంఖ్య 21,327 తగ్గగా.. కొత్తగా 69,634 మందిని మాత్రమే రిక్రూట్ చేసుకున్నాయి. NASSCOM మార్చి నెలలో విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత టెక్ రంగంలో మెుత్తం 54 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పైగా దేశీయ ఐటీ కంపెనీలు ప్రధానంగా ఉత్తర అమెరికా, యూరప్ మార్కెట్లపై తమ ప్రాజెక్టుల కోసం భారీగా ఆదారపడి ఉన్నాయి.
వివరంగా పరిశీలిస్తే.. తొలి త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, L&T టెక్నాలజీ సర్వీసెస్, పెర్సిస్టెంట్, Coforge ఈ త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్యను పెంచిన నాలుగు కంపెనీలుగా ఉన్నాయి. ఈ క్రమంలో టీసీఎస్ నికరంగా 523 మందిని, పెర్సిస్టెంట్ నికర ప్రాతిపదికన 241 మందిని, Coforge 1,000 మందిని, LTTS అత్యధికంగా 1,159 మంది టెక్కీలను రిక్రూట్ చేసుకున్నాయి. ఇదే క్రమంలో చాలా కంపెనీలు ప్రాజెక్టులు లేక ఎంపిక చేసిన టెక్కీలను ఆన్‌బోర్డ్ చేయకుండా ఆలస్యం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా బయటి పరిస్థితులతో బయపడుతున్న చాలా మంది టెక్కీలు ఉద్యోగాలు మారేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీనికారణంగా అట్రిషన్ రేటు గతంలో కంటే తక్కువగా నమోదైంది. అయితే అట్రిషన్ కారణంగా మానేసిన ఉద్యోగుల స్థానాల్లో కొత్త వారిని నియమించుకోకుండా కంపెనీలు ఖాళీలను అలాగే ఉంచుతున్నాయి. రానున్న త్రైమాసికంలో సైతం పరిస్థితులు ఇలాగే కొనసాగవచ్చని, నియామకాల్లో ఎలాంటి దూకుడు కనిపించటం లేదని స్టాఫింగ్ సంస్థలు చెప్పటం టెక్కీలను ఆందోళనకు గురిచేస్తోంది. చాలా కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగుల వేతన పెంపులను వాయిదా వేయగా.. వేరియబుల్ పే విషయంలోనూ కోతలు విధించిన సంగతి తెలిసిందే. ఇవి యువ టెక్ గ్రాడ్యుయేట్లను అయోమయంలోకి నెడుతున్నాయి.


Click it and Unblock the Notifications