Tomato Price: టమాటా కిలో 30 రూపాయలే.. ఎక్కడంటే..
తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు భారీగా తగ్గాయి. వారం రోజుల కిందటి వరకు భారీగా పెరిగిన టమాటా ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 20 రోజుల ముందు వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో కిలో టమాటా కిలో రూ.250 నుంచి రూ.300 వరకు పలికింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ. 150 నుంచి రూ.200 వరకు చేరింది. ఏపీలోని మదనపల్లె మార్కెట్ టమాటా ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారం మార్కెట్ కు దాదాపు 4000 కిలోల టమాటా రావడంతో ధరలు తగ్గాయి. ఏ గ్రేడ్ టమాటా కిలో రూ.30 నుంచి రూ.40 పలకగా.. బీ గ్రేడ్ టమాటా కు రూ. 21 నుంచి రూ.28 వరకు పలికింది.
వ్యాపారులు టమాటా సగటు ధర రూ.26 నుంచి 28 లకు కొనుగోలు చేసినట్లు మార్కెట్ అధికారులు చెప్పారు. ఇక గురువారం కూడా టమాటా ధర తగ్గిన విషయం తెలిసిందే. మంచి రకం టమాటాకు కిలో రూ. 50 నుంచి రూ.64 పలుకగా.. నాణ్యత తక్కువగా ఉన్న టమాటా ధర కిలో రూ. 36 నుంచి రూ.48 వరకు పలికినట్లు అధికారులు తెలిపారు. గత సోమవారం హైదరాబాద్ లోని పలు రైతు బజారుల్లో కిలో టమాటా రూ.63 నుంచి రూ.70 పలికింది. సోమవారం 2450 క్వింటాళ్ల టమాటా వచ్చింది. దీంతో టమాటా ధరలు తగ్గాయి.

హైదరాబాద్ చుట్టూ పక్కల జిల్లాలైన వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ నుంచి భారీగా టమాటా వస్తోంది. అటు రాయలసీమ జిల్లాలైన అనంతపురం, చిత్తూరు నుంచి భారీగా టమాటా నగరానికి చేరుతోంది. దీంతో టమాటా ధరలు తగ్గుతున్నాయి. ఈ నెల చివరి వరకు కిలో టమాటా రూ. 30 నుంచి రూ.40 మధ్య ఉండొచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అయితే రైతు బజార్, మార్కెట్లలో టమాటా ధరలు తక్కువే ఉన్నా.. రిటైల్ మార్కెట్, బయట టమాటా ధరలు రూ. 70 లకు పైనే ఉన్నాయి.
దేశంలోని పలు ప్రాంతాల్లో టమాటా ధరలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో టమాట కిలో రూ.150కి పైగా అమ్ముతున్నారు. లక్నోలోని హోల్‌సేల్ మార్కెట్‌లలో ఎ-గ్రేడ్ టొమాటో ధరలు ఇప్పటికీ కిలో రూ. 100 కంటే ఎక్కువగా ఉండగా, కాన్పూర్, వారణాసి మరియు జైపూర్ మార్కెట్‌లలో ధరలు కిలో రూ. 100 కంటే తక్కువగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరగడానికి ప్రధాన కారణం సరఫరాలో అంతరాయమేనని అధికారులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications