Tomato Price: గత నెలలో ఒక్కసారిగా ఆకాశాన్ని తాకిన టమాటా జీవితకాలంలో ఎన్నడూ ప్రజలు చూడని రేట్లకు అమ్ముడైంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో అప్పుడు కిలో రేటు రూ.200 నుంచి గరిష్ఠంగా 400 మధ్యకు చేరుకుంది. దీనిని చూసిన ప్రజలు అసలు టమాటా తినగలమా అనుకున్నారు.
అయితే ఆ సమయంలో అధిక వర్షాల కారణంగా చాలా చోట్ల పంట నష్టం జరగటంతో డిమాండ్ సప్లై వ్యత్యాసం రైతులను కోటీశ్వరులుగా మార్చేసింది. అనేక సార్లు టమాటా ధరలు పతనమై రోడ్ల పక్కన పంటను పారబోసిన చాలా మంది రైతులకు ఒక్కసారిగా మంచి కాలం వచ్చింది. టమాటా రైతులకు ఆగస్టు మాసం ఊహించని లాభాలను తెచ్చిపెట్టింది.

కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. క్రమంగా తగ్గుతూ వస్తున్న టమాటా ధరలు తరిగి సామాన్యుల వంటింట్లోకి అడుగుపెడుతోంది. చాలా మంది రైతులు వేసిన పంట చేతికి రావటంతో మార్కెట్లలోకి సరకు విపరీతంగా వస్తోంది. ఇది ధరల పతనానికి దారితీసింది. ప్రస్తుతం ఏపీలో టమాటాకు ప్రధాన మార్కెట్లలో ఒకటైన మధనపల్లెలో కిలో ధర రూ.7 పలకటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టన్నుల్లో టమాటా ఒక్కసారిగా మార్కెట్లోకి రావటం, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఇక్కడికి రాకపోవటం వంటి కారణాలు ధరల పతనానికి దారితీశాయని రైతులు వాపోతున్నారు.
మూడు వారాల కిందట మార్కెట్లకు టబ్బుల్లో టమాటాలు తెచ్చి.. జోబుల నిండా డబ్బుల కట్టలతో వెళ్లిన రైతులకు ప్రస్తుత ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కనీసం మార్కెట్లకు తీసుకొచ్చినందుకు ఖర్చులు కూడా రావటం లేదని చెబుతున్నారు. దళారులు మరీ తక్కువ ధరలకు సరకు కొనుగోలు చేయటంపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు. గత నెల చివరిలో టమాటా ధర కిలోకు రూ.30-40 మధ్య పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధరలు మరింతగా తగ్గి రిటైల్ విక్రయాలు కిలోకు రూ.15-25 మధ్య జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications