Job News: టెక్ దిగ్గజాల నుంచి స్టార్టప్‌ల వరకు పలు కంపెనీలు వరుస లేఆఫ్స్‌తో ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. ఏకంగా లక్షల సంఖ్యలో సిబ్బందికి ఉద్వాసన పలికాయి. ఇక ఫ్రెషర్స్ సంగతి అయితే మరీ దారుణం. ఆఫర్ లెటర్స్ ఇచ్చిన సంస్థలు సైతం ఆన్‌బోర్డ్ చేసేందుకు మొహం చాటేశాయి. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోంది.
ఇటీవల పలు కంపెనీలు రిక్రూట్‌మెంట్ చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు మీడియా నివేదికలు వెలువడుతున్నాయి. వాటిలో లగ్జరీ ఫ్యాషన్ ఉత్పత్తుల తయారీ కంపెనీ టైటాన్ కూడా ఒకటి. వచ్చే ఐదేళ్లలో దాదాపు 3 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది.

ఇంజినీరింగ్, డిజైన్, లగ్జరీ, డిజిటల్, డేటా అనలిటిక్స్, మార్కెటింగ్ మరియు సేల్స్ సహా పలు డొమైన్‌లలో కొత్తగా ఉద్యోగులను చేర్చుకోవాలని యోచిస్తున్నట్లు టైటాన్ తెలిపింది. వీటికితోడు సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, డిజిటల్ మార్కెటింగ్ మరియు లేటెస్ట్ కటింగ్ ఎడ్జ్ నైపుణ్యాలు కలిగిన నిపుణుల కోసం వెతుకుతున్నట్లు స్పష్టం చేసింది.
'రాబోయే 5 సంవత్సరాల్లో బిజినెస్‌ను లక్ష కోట్ల వ్యాపారంగా విస్తరించాలని ఆశిస్తున్నాం. ఈ ఉత్తేజకరమైన ప్రయాణంలో భాగంగా 3 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్నాం. వివిధ రంగాలకు చెందిన యువకులు, అనుభవజ్ఞులైన నిపుణుల సమిష్టి కృషితో.. పరిశ్రమలో మా స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాం' అని టైటాన్ హెడ్ HR ప్రియా మతిలకత్ పిళ్లై ఓ ప్రకటనలో తెలిపారు.


Click it and Unblock the Notifications