Real Estate Hotspot: దేశం అభివృద్ధి వేగవంతం అయిన వేళ కొత్త నగరాల సృష్టి, అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే కిక్కిరిసిన మహానగరాలకు పోటీగా కొత్త నగరాల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో రియల్టీ మార్కెట్ కొత్త పుంతలు తొక్కుతూ దేశంలోని వివిధ నగరాల్లో వృద్ధి చెందుతోంది. ఇది ప్రాపర్టీ ఇన్వెస్టర్లకు కొత్త పెట్టుబడి అవకాశాలను తెచ్చిపెడుతోంది.
ముంబై, దిల్లీ, బెంగళూరు నగరాల్లో ప్రాపర్టీ ధరలు ఆకాశాన్నంటడంతో రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయాల కోసం వెతుకులాటలో ఉన్నారు. ఈ క్రమంలో దేశంలో కొత్తగా రియల్టీ మార్కెట్ పుంజుకోనున్న 17 నగరాల వివరాలను ప్రాపర్టీ రీసెర్చ్ సంస్థ కొలియన్స్ ఇండియా తాజాగా వెల్లడించింది. ఈ క్రమంలో భారత రియల్టీ మార్కెట్ 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2050 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నివేదిక వెల్లడించింది.

ఫ్యూచర్ గ్రోత్ సిటీస్:
ఉత్తరాన- అమృత్‌సర్, అయోధ్య, జైపూర్, కాన్పూర్, లక్నో, వారణాసి
తూర్పున- పాట్నా, పూరీ
పశ్చిమాన- ద్వారక, షిరిడీ, నాగ్‌పూర్, సూరత్
దక్షిణాన- తిరుపతి, కొచ్చి, కోయంబత్తూర్, విశాఖపట్నం, ఇండోర్
కొత్త రియల్టీ హాట్‌స్పాట్లుగా ఉద్భవించనున్న పైన పేర్కొన్న నగరాల్లో.. ఆఫీసులు, గోదాములు, టూరిజం, లివింగ్ అండ్ సీనియర్ లివింగ్ వంటి ఆస్తులు వేగవంతమైన వృద్ధిని సాధించటానికి సిద్ధంగా ఉన్నాయి. నివేదిక ప్రకారం.. కోయంబత్తూర్, ఇండోర్, కొచ్చి బలమైన శాటిలైట్ ఆఫీస్ మార్కెట్‌లుగా ఎదుగుతున్నాయి. అలాగే జైపూర్, కాన్పూర్, లక్నో, నాగ్‌పూర్, పాట్నా, సూరత్‌లు డిజిటలైజేషన్‌ను పెంచుతాయని భావిస్తున్నారు. అమృత్‌సర్, అయోధ్య, ద్వారక, పూరి, షిర్డీ, తిరుపతి, వారణాసి వంటి నగరాలు ఆధ్యాత్మిక పర్యాటకం వృద్ధి నుంచి ప్రయోజనం పొందేందుకు సిద్ధంగా ఉన్నాయి.
2050 నాటికి భారతదేశం దాని ఎనిమిది మెగా-సిటీలతో పాటు దాదాపు 100 నగరాలను కలిగి ఉంటుందని అంచనా వేయబడింది. నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్, PM గతిశక్తి ప్రాజెక్ట్‌లు టైర్ I నగరాలను మించి వృద్ధిని పెంచడంలో కీలకమైనవి. మెరుగైన కనెక్టివిటీ, తయారీ కార్యకలాపాలు ఈ ఉద్భవిస్తున్న హాట్‌స్పాట్‌లలో గిడ్డంగులు, నివాస విభాగాలలో డిమాండ్‌ను పెంచుతాయని భావిస్తున్నారు. వీటికి తోడు చాలా కంపెనీలు హైబ్రిడ్ వర్క్ మోడల్స్ వైపు మారడం వల్ల చిన్న నగరాల్లో ఆఫీస్ స్పేస్‌లకు డిమాండ్ పెరుగుతోందని వెల్లడైంది.
ఇక్కడ తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనించాల్సిన నగరాల్లా మెుదటగా తిరుపతి ఉండగా, రెండవ నగరంగా విశాఖ నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా భక్తులను కలిగి ఉన్న తిరుమల వెంకన్న సన్నిధి కలిగిన తిరుపతి టెంపుల్ టూరిజంతో మరింత వృద్ధిని సాధిస్తుందని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే నవ్యాంధ్రలో విశాఖ నగరాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలని చూస్తున్న వేళ నగరంలో కొత్త రియల్టీ పెట్టుబులు పెట్టేందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం సైతం ఈ రెండు నగరాల అభివృద్ధిపై ఫోకస్ కొనసాగించటంతో పాటు అమరావతి అభివృద్ధి కూడా పెట్టుబడికి అనువైన నగరంగా మారుతోంది.


Click it and Unblock the Notifications