శాశ్వత నిషేధం, ఉద్యోగాల కోత ప్రారంభించిన టిక్‌టాక్
ఢిల్లీ: భారత్‌లో అడుగు పెట్టిన తక్కువ కాలంలోనే షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ చాలా ఫేమస్ అయింది. దీనిపై శాశ్వత నిషేధం విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వీచాట్‌తో పాటు 59 యాప్స్ శాశ్వత నిషేధిత జాబితాలో ఉన్నట్లు సంబంధిత శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది జూన్ నెలలో చైనాకు చెందిన యాప్స్ పైన భారత్ కొరఢా ఝుళిపించిన విషయం తెలిసిందే.
మొత్తంగా వందలాది యాప్స్‌కు షాకిచ్చింది. ఈ యాప్స్ తిరిగి మనుగడలోకి వస్తాయని చాలామంది భావించారు. అయితే వీటి శాశ్వత నిషేధానికి సంబంధించి సదరు కంపెనీలకు మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది.

ఉద్యోగులకు సమాచారం
శాశ్వత నిషేధం నేపథ్యంలో టిక్‌టాక్ ఇండియా తన ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ప్రారంభించిందట. శాశ్వత నిషేధానికి సంబంధించి కేంద్రం నోటీసులు తదితర అంశాలను ఉద్యోగులకు తెలిపిన ఈ సంస్థ ఉద్యోగాల కోత అంశానికి సంబంధించిన వివరాలు కూడా తెలియజేసింది. ఈ మేరకు ఇంటరిమ్ సీఈవో వనేస్సా పప్పాస్, వీపీ బ్లేక్ చాండ్లీ ఉద్యోగులకు సమాచారాన్ని అందించారు.

వివరణపై అసంతృప్తి
జాతీయ భద్రత కోణంలో గత ఏడాది జూన్ నెలలో నిషేధం అనంతరం యూజర్ల డేటా నుండి సేకరించిన సమాచారాన్ని ఎలా వినియోగిస్తున్నారో వెల్లడించాలని ప్రభుత్వం ఆదేశించగా, వాటి వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో గతవారం నోటీసులు జారీ చేశారు. దీంతో తాత్కాలిక నిషేధం శాశ్వతమైంది. దీనిపై కంపెనీ ప్రతినిధులు స్పందించారు.
కేంద్రం నోటీసులను పరిశీలించి, తగిన విధంగా స్పందిస్తామని, 2020లో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా మొదట నడుచుకుంది తామేనని తెలిపింది. స్థానిక చట్టాలు, నిబంధనలు గౌరవిస్తామని, గత ఏడు నెలలుగా తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, కానీ తమ యాప్స్ పునఃప్రారంభం ఎప్పుడు, ఎలా అనే అంశంపై స్పష్టమైన సూచనలు రాలేదని తెలిపింది.

ఉద్యోగుల తొలగింత
భారత్‌లో తమ 2,000కు పైగా ఉద్యోగులు నిరంతరం సంస్థ ఉన్నతికి కృషి చేశారని తెలిపింది. టిక్‌టిక్‌ను తిరిగి ప్రారంభించేందుకు, తద్వారా లక్షలాది మంది కళాకారులు, స్టోరీ టెల్లర్స్, విద్యావేత్తలు, ప్రదర్శనకారులకు మద్దతు ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. అమెరికా సహా పలు దేశాల్లోను టిక్ టాక్ ఇబ్బందులు ఎదుర్కొంది.


Click it and Unblock the Notifications