హైదరాబాద్‌లో ఆన్‌లైన్ పెట్టుబడి మోసాలు కలకలం.. రూ.1.6 కోట్లకు పైగా మోసం.. ఎలా చేశారంటే..
హైదరాబాద్ నగరంలో మరోసారి ఆన్‌లైన్ పెట్టుబడి మోసాలు కలకలం రేపాయి. పెట్టుబడి సలహాదారులుగా నటిస్తూ మోసగాళ్లు ముగ్గురు నగరవాసులను వలలో వేసి ఏకంగా రూ.1.6 కోట్లకు పైగా మోసం చేశారు. ఈ మూడు ఘటనలపై హైదరాబాద్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మొదటి ఘటన యూసుఫ్‌గూడకు చెందిన 38 ఏళ్ల వ్యాపారవేత్తను లక్ష్యంగా చేసుకుని జరిగింది. ఇ-కామర్స్ కంపెనీకి చెందినట్లు చెప్పుకున్న లక్ష్మీ శర్మ అనే మహిళ అతనికి వాట్సాప్ ద్వారా సందేశం పంపింది. ఆమె 10 మాల్-VIP210 అనే వాట్సాప్ గ్రూప్‌లో చేర్చింది. ఆ గ్రూప్‌లో చిన్న పెట్టుబడులపై మొదట స్వల్ప లాభాలు చూపించారు. దాంతో నమ్మకం కలిగిన బాధితుడు 10rsshopping.com అనే వెబ్‌సైట్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాడు. మే 1 నుండి సెప్టెంబర్ 29 వరకు మొత్తం 128 లావాదేవీల ద్వారా రూ.65.4 లక్షలు బదిలీ చేశాడు. తరువాత అకస్మాత్తుగా ఆ వెబ్‌సైట్ యాక్సెస్ చేయడం ఆగిపోయింది. అప్పుడు తనను fake investment schemes ద్వారా మోసం చేశారని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

ఇక రెండవ కేసులో బంజారా హిల్స్‌కు చెందిన 46 ఏళ్ల వ్యాపారవేత్త నకిలీ స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ సలహాదారుల వలలో చిక్కుకున్నాడు. ఒక ప్రముఖ ఆన్‌లైన్ ట్రేడింగ్ కంపెనీ పేరుతో మోసగాళ్లు అతనిని సంప్రదించారు. మొదట నకిలీ ఖాతాలో భారీ లాభాలు చూపించి నమ్మకం కలిగించారు. ఆ ఖాతా రూ.11.7 కోట్ల లాభాలను చూపించింది. కానీ డబ్బును ఉపసంహరించుకునే ప్రయత్నం చేసినప్పుడు, నిధులు బదిలీ కాలేదు. ఈ విధంగా అతను రూ.56 లక్షలు మోసపోయాడు. సైబర్ క్రైమ్ అధికారులు మాట్లాడుతూ .. ఇలాంటి మోసగాళ్లు నిజమైన వెబ్‌సైట్‌ల URLలను పోలి ఉండే నకిలీ లింకులు తయారు చేస్తారు. పెట్టుబడిదారులు ఈ వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఇక మూడవ కేసు అత్తాపూర్‌కు చెందిన 63 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిపై జరిగింది. వాట్సాప్‌లో వచ్చిన ఒక లింక్ ద్వారా స్టాక్ మార్కెట్ పెట్టుబడి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఆ యాప్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించాడు. ఆయన మొత్తం రూ.40 లక్షలు బదిలీ చేశాడు. కానీ లాభాలు పొందడం కష్టమై, డబ్బును ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించగా టిడిఎస్ (TDS) పన్ను చెల్లించాలంటూ అదనపు చెల్లింపులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. చివరికి తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు.
ఈ మూడు ఘటనలపై పోలీసులు ఐపీసీ, ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మోసగాళ్లను గుర్తించి పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు వేగవంతం చేసింది. ఏ పెట్టుబడి వేదికలోనైనా డబ్బు పెట్టే ముందు అది ప్రభుత్వానిదో లేదా రిజిస్టర్ చేయబడిన సంస్థదో ఖచ్చితంగా ధృవీకరించాలి. అవాంఛిత లింక్‌లను ఓపెన్ చేయకూడదు, వాట్సాప్ లేదా సోషల్ మీడియాలో షేర్ అయ్యే పెట్టుబడి ఆఫర్లపై నమ్మకం పెట్టుకోకూడదని పోలీస్ అధికారులు సూచించారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో జరిగే ఈ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మోసగాళ్లు నకిలీ వెబ్‌సైట్‌లు, యాప్‌లు, వాట్సాప్ గ్రూపులు ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు. చిన్న లాభాలతో మొదలుపెట్టి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వసూలు చేసే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. అందువల్ల సాంకేతిక పరిజ్ఞానంతో పాటుగా ప్రజల్లో అవగాహన పెరగడం అత్యంత అవసరమని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications