Lottery King: ఆయా రాజకీయ పార్టీలకు ఎంతోమంది విరాళాలు ఇస్తూ ఉంటారు. ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా భారీ మొత్తంలో డొనేషన్ ఇచ్చి పన్ను మినహాయింపులు సైతం పొందుతారు. ఇది సరికాదంటూ ఇటీవల కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో గత ఐదేళ్లలో ఈ విధంగా విరాళాలు ఇచ్చిన వారి జాబితాను సమర్పించాలంటూ భారతీయ స్టేట్ బ్యాంక్ కు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు సూచన మేరకు SBI సమర్పించిన లిస్టులో అనూహ్యంగా కొందరు పేర్లు తెరపైకి వచ్చాయి. టాటాలు, అంబానీలు, అదానీలు ఈ జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటారని అంతా భావించారు. అయితే వాటన్నిటిని పటాపంచలు చేస్తూ వారి ప్రస్తావనే లేదు. కానీ ఎవరూ ఊహించని వ్యక్తి పేరు ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉంది. అతను మరెవరో కాదు 'లాటరీ కింగ్'గా పేరుగాంచిన శాంటియాగో మార్టిన్.

ఏకంగా 1,368 కోట్లు విరాళంగా ఇచ్చి ఈ లిస్టులో టాప్ ప్లేస్ లో నిలిచాడు. దీన్నిబట్టి అతడి సంపాదన ఎంత ఉంటుందో ఊహించవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 13 రాష్ట్రాల్లో లాటరీ బిజినెస్ ద్వారా భారీగా ఆర్జిస్తున్నాడు. 2023లో తమిళనాడులోని ఆయన వ్యాపారాలు ఫ్యూచర్ గేమింగ్ & హోటల్స్‌పై ఈడీ దాడులు నిర్వహించి 457 కోట్లను ఫ్రీజ్ చేసింది. ఏప్రిల్ 2, 2022న ఈడీ దాదాపు 410 కోట్లను అటాచ్ చేసింది. ఇది జరిగిన కేవలం ఐదు రోజుల్లోనే 100 కోట్లు మేర ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనుగోలు చేయడం విశేషం.
మన హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కంపెనీ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ప్రా తదనంతర స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ 966 కోట్లను విరాళంగా ఇచ్చింది. మైనింగ్ సంస్థ వేదాంత కూడా భారీ స్థాయిలో 400 కోట్లు ఫండింగ్ చేసింది. దీన్ని బట్టి చూస్తే టాప్ 5 లోని 3 కంపెనీలు.. ఈడీ లేదా ఆదాయపన్నుకు సంబంధించి కేసులు ఎదుర్కొన్నవే కావడం గమనార్హం. ఇక మిగిలిన వాటిలో భారతీ ఎయిర్‌టెల్, యశోద సూపర్ స్పెషాలిటీ వంటి ప్రముఖ సంస్థలు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications