మూడు వ్యాపారాలు ఫెయిల్.. రూ.2 కోట్ల అప్పు చేతికి.. ఇప్పుడు రూ. 10 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి..
మార్కెట్లో వెనుకడుగు వేయని దృఢ సంకల్పం, తనపై తనకు నమ్మకం ఉంటే, ఎలాంటి గాడ్‌ఫాదర్ లేదా భారీ పెట్టుబడులు లేకుండా కూడా విజయ శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించారు నవీ ముంబైకి చెందిన పంకజ్ శ్రీవాస్తవ. నేడు డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో ప్రముఖ సంస్థగా ఎదిగిన 'యూనోసెర్చ్' (UnoSearch) వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన పంకజ్ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన, ఈ స్థాయికి చేరుకోవడానికి ముందు వరుసగా మూడు వ్యాపారాల్లో విఫలమై, సుమారు 2 కోట్ల రూపాయల భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.
పంకజ్ కుటుంబం మొత్తం ఉద్యోగ నేపథ్యం కలది కావడంతో.. వారిలో ఎవరికీ వ్యాపార రంగంపై కనీస అవగాహన లేదు. అయినప్పటికీ, Pankaj Srivastava తన అంకితభావంతో ఎంసీఏ (MCA) పూర్తి చేసి, దేశంలోని అగ్రగామి ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఉద్యోగం సంపాదించారు. అక్కడ ఆయన కనబరిచిన అద్భుతమైన పనితీరు కారణంగా కంపెనీ ఆయనను యునైటెడ్ స్టేట్స్ (అమెరికా)కు పంపించింది.

అమెరికాలో లగ్జరీ జీవితం, సురక్షితమైన ఉద్యోగం, భారీ జీతం ఉన్నప్పటికీ, సొంతంగా ఏదైనా సాధించాలనే కల ఆయనను నిరంతరం వెంటాడుతూనే ఉండేది. అక్కడ చాలా మంది ఉద్యోగాల కంటే సొంత వ్యాపారాలకే ప్రాధాన్యత ఇవ్వడం చూసి స్ఫూర్తి పొందిన పంకజ్, ఒక పెద్ద సాహసానికి సిద్ధపడ్డారు. అమెరికాలో నాలుగేళ్ల పాటు చేసిన ఉద్యోగాన్ని వదిలేసి, 2008లో భారతదేశానికి తిరిగి వచ్చారు.
భారతదేశానికి వచ్చిన తర్వాత ఏ పెట్టుబడిదారుడి (Investor) సహాయం తీసుకోకుండా, తన సొంత పొదుపు మొత్తంతోనే వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టారు. కానీ, దురదృష్టవశాత్తూ ఆయన ప్రారంభించిన మొదటి వ్యాపారం దారుణంగా విఫలమైంది. దాంతో పట్టువదలకుండా రెండో వ్యాపారం, అది కూడా నష్టపోవడంతో మూడో వ్యాపారం ప్రారంభించారు. కానీ, 2014 నాటికి ఆయన చేసిన మూడు వ్యాపారాలూ పూర్తిగా విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఆయన దాచుకున్న పొదుపు మొత్తం కరిగిపోవడమే కాకుండా, సుమారు రూ. 2 కోట్ల రూపాయల అప్పు మిగిలింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఆయన పరాజయాన్ని ఒప్పుకోలేదు.
చివరకు 2014లోనే తన భార్య ప్రేరణతో కలిసి 'యూనోసెర్చ్' అనే సరికొత్త సంస్థకు శ్రీకారం చుట్టారు. దీనిని ప్రారంభించడానికి తన కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి రూ. 1 లక్ష రూపాయల పెట్టుబడిని అప్పుగా తీసుకున్నారు. ప్రారంభంలో ఈ కంపెనీ కేవలం ఆరోగ్య సంరక్షణ (Healthcare) రంగానికి మాత్రమే డిజిటల్ మార్కెటింగ్ సేవలను అందించేది. అయితే, 2016లో రిలయన్స్ జియో రాకతో దేశంలో డిజిటల్ విప్లవం ఊపందుకోవడం ఈ కంపెనీకి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.
టెక్నాలజీ మారుతున్న కొద్దీ తమ సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను కూడా జోడించి కంపెనీ పరిధిని అంతర్జాతీయ స్థాయికి విస్తరించారు. ఒకప్పుడు రూపాయి లేక ఇబ్బంది పడిన పంకజ్ సంస్థకు, నేడు అమెరికా, యూరప్, భారతదేశాల్లో కలిపి 150 మందికి పైగా అంతర్జాతీయ క్లయింట్లు ఉన్నారు. 80 మందికి పైగా ఉద్యోగులతో నడుస్తున్న ఈ కంపెనీ ప్రస్తుత వార్షిక ఆదాయం దాదాపు రూ. 10 కోట్ల రూపాయలకు చేరుకుంది. వరుస ఓటములు ఎదురైనా, పట్టుదలతో పోరాడితే విజయం ఖాయమని పంకజ్ శ్రీవాస్తవ జీవితం నేటి యువతకు గొప్ప స్ఫూర్తినిస్తోంది.


Click it and Unblock the Notifications
