హైదరాబాద్ నుంచి విజయవాడకు గంటలో ప్రయాణం.. ముంబైకి అయితే రెండు గంటలే..మూడు బుల్లెట్ ట్రైన్ల వివరాలు ఇవే..
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న ఏడు బుల్లెట్ రైలు కారిడార్లలో.. మూడు రూట్లు ఈ రాష్ట్రానికే కేటాయించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ వల్లే తెలంగాణ రాష్ట్రానికి ఈ భారీ ప్రాజెక్టులు వచ్చాయని.. రాబోయే రోజుల్లో తెలంగాణ దేశంలోనే ఒక పెద్ద బుల్లెట్ ట్రైన్ హబ్‌గా అవతరించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ విప్లవాత్మక ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే నగరాల మధ్య ప్రయాణ సమయాలు ఊహించని విధంగా తగ్గిపోతాయని ఆయన వివరించారు.
పూణే, చెన్నై, బెంగళూరు నగరాలను కలుపుతూ ప్రతిపాదించిన మూడు సరికొత్త బుల్లెట్ రైలు కారిడార్లతో హైదరాబాద్ నగరం భవిష్యత్తులో ఒక ప్రధాన హై-స్పీడ్ రైలు కేంద్రంగా (హబ్) ఆవిర్భవించనుందని తెలిపారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలను ఒకదానితో ఒకటి అనుసంధానించడమే కాకుండా, హైదరాబాద్ నగరం యొక్క వృద్ధి పథాన్ని, రూపురేఖలను పూర్తిగా మార్చేస్తాయని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రముఖ ఐటీ సదస్సు (HYSEA GCCS & IT రౌండ్‌టేబుల్) ముగిసిన అనంతరం మంత్రి మాట్లాడారు. తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పన కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 5,400 కోట్ల రూపాయలను కేటాయించిందని, ఇది రాష్ట్ర రవాణా రంగానికి ఒక గేమ్-ఛేంజర్‌గా నిలుస్తుందని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ నగరానికి.. పుణె-హైదరాబాద్, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు అనే మూడు హై-స్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లను మంజూరు చేశారని.. దీనివల్ల హైదరాబాద్ కేంద్రంగా భారీ ఎత్తున వికేంద్రీకృత అభివృద్ధి జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
రైల్వే రంగంతో పాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎలక్ట్రానిక్స్ తయారీ రంగ ప్రోత్సాహకాల వల్ల కూడా తెలంగాణ రాష్ట్రం కీలక లబ్ధిదారుగా అవతరించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ వివిధ రాయితీ పథకాల కింద రాష్ట్రంలో ఇప్పటికే 100కు పైగా సరికొత్త ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించి ఉపాధిని పెంపొందిస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఈ సరికొత్త రైలు మార్గాలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం ఒక గంట పది నిమిషాల్లోనే చేరుకోవచ్చని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. అలాగే దేశ వ్యాపార రాజధాని అయిన ముంబై నగరానికి రెండు గంటల ఇరవై నిమిషాలు, అటు చెన్నై నగరానికి కేవలం రెండు గంటల్లోనే దూసుకుపోవచ్చని తెలిపారు. ఈ మెగా ప్రాజెక్ట్ దేశ రవాణా రంగంలోనే ఒక సరికొత్త మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.
ఇదే సమయంలో ఈ ప్రాజెక్టుల క్రెడిట్ కోసం కొందరు పాకులాడుతున్నారంటూ ప్రతిపక్షాలపై మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. ఈ చారిత్రక అభివృద్ధి యొక్క పూర్తి క్రెడిట్ ప్రధాని మోదీకే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. గత యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్‌లో కేవలం 800 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తే.. తమ ప్రభుత్వం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే ఏకంగా 5,000 కోట్ల రూపాయలకు పైగా రైల్వే నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. ఈ నిధుల వరద వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయని అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications
