ఇంటర్నెట్‌లో.. ఒక్క నిమిషంలో.. ఏం జరుగుతుందో తెలుసా?
అదేదో సినిమాలో 'మొక్కే కదాని పీకిపారేస్తే..' అంటూ హీరో రౌద్రంగా ఒక డైలాగ్ చెబుతాడు. అంటే మరీ అంత తేలిగ్గా తీసిపారేయొద్దు అని. ఇక సమయం కూడా చాలా విలువైనది అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చాలామంది సమయానికి పెద్దగా విలువ ఇవ్వరు. 'ఒక్క నిమిషమేకదా..' అంటూ కొంతమంది తీసిపారేస్తుంటారు కానీ, ఒక్క నిమిషం అంటే.. 60 సెకన్లు!
ఆ 60 సెకన్లలో చాలా పనులు జరిగిపోతాయి. అవును, ఎక్కడివరకో ఎందుకు? ఆన్‌లైన్‌లోనే చూసుకుంటే.. ఆ 60 సెకన్లలో.. అంటే ఒక్క నిమిషంలోనే చాలా పనులు జరిగిపోతాయి. సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో నిమిషానికి 38 లక్షల విషయాలు నెటిజన్లు వెతుకుతారట. అలాగే ఫేస్‌బుక్‌లో నిమిషం సమయంలో ఏకంగా పది లక్షల మంది లాగిన్ అవుతారట.

అంతేకాదు, నిమిషం వ్యవధిలో యూట్యూబ్‌లో 45 లక్షల మంది యూజర్లు వీడియోలు వీక్షిస్తారట. ఇక ఆన్‌లైన్ షాపింగ్ విషయానికి వస్తే.. ఆ ఒక్క నిమిషంలోనే ఖర్చు చేసే మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు డాలర్లు. అంతేకాదు, నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఆ ఒక్క నిమిషంలో కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు చూసే సినిమా సమయాన్ని లెక్కగడితే.. అది 6,94,444 గంటలకు సమానం అవుతుందట.
ఇక ట్విట్టర్‌లో ఒక్క నిమిషం సమయంలో ఎంతమంది ట్వీట్లు చేస్తారో తెలుసా? 87,500 మంది యూజర్లు. అలాగే వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లో అయితే యూజర్లు ఆ సమయంలోనే నాలుగు కోట్ల పదహారు లక్షల మెసేజ్‌లు పంపించుకుంటారట. మామూలు మెసేజింగ్ వ్యవస్థ ద్వారా అయితే ఒక కోటీ ఎనభై ఒక్క లక్షల మెసేజ్‌లు వెళతాయట. మెయిల్స్ విషయానికొస్తే.. ఆ ఒక్క నిమిషంలోనే 18 కోట్ల 80 లక్షల ఈ-మెయిళ్లు వెళ్లిపోతాయట.
ఇంకా గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లలో నిమిషానికి 3,90,030 యాప్స్‌ను యూజర్లు డౌన్‌లోడ్ చేసుకుంటారట. స్నాప్‌చాట్‌లో 21 లక్షల స్నాప్స్ క్రియేట్ అవుతాయి. ఇంకా ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు చేసే స్క్రోలింగ్స్ ఎన్నో తెలుసా? మూడు లక్షల నలభై ఏడు వేల, రెండు వందల ఇరవై రెండు. ఇక అదే ఒక్క నిమిషంలో స్కైప్ ద్వారా యూజర్లు 2,31,840 కాల్స్ చేస్తారట!
ఇలా చెప్పుకుంటే పోతే, ఎన్నెన్నో! ఆ ఒక్క నిమిషం సమయంలో జిఫీ అనే ప్లాట్‌ఫామ్‌పై 4.8 మిలియన్ జిఫ్ యానిమేషన్లు క్రియేట్ అవుతాయి. మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్ ద్వారా 41 మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్స్ అవుతాయి. ఇంకా నిమిషం సమయంలో 180 అమెజాన్ ఎకో స్పీకర్ల షిప్పింగ్ కూడా జరుగుతుందట. ఇదంతా చదువుతుంటే.. నిజమా, ఒక్క నిమిషంలో ఇంటర్నెట్‌లో ఇన్ని పనులు జరుగుతాయా? అని ఆశ్చర్యంగా కలుగుతుంది కదూ!


Click it and Unblock the Notifications